
అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించండి:జేసి
కర్నూలు నగరపాలక సంస్థ : అనధికార లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని అర్హులైన వారు వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య సూచించారు. బుధవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఎల్‌ఆర్‌యస్ పథకంపై లైసెన్స్ ఇంజనీర్లతో జేసి, నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకంలో కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం జీఓ 134 జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 30కి ముందు ఏర్పాటైన అనధికార లేఔట్లు, ప్లాట్లను క్రమబద్దీకరించుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకు అక్టోబర్ 24వ తేదీలోపు రూ.10 వేలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది తనిఖీ చేసి ధ్రువీకరించిన తర్వాత మార్కెట్ విలువలో 14 శాతం అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చన్నారు.
45 రోజు ల్లోపు పూర్తి రుసుం చెల్లించిన వారికి 10 శాతం రాయితీ, 45 నుంచి 90 రోజుల వ్యవధిలో చెల్లిం చిన వారికి 5 శాతం రాయితీ ఉంటుందన్నారు. గడువులోపు క్రమబద్ధీకరించుకోని అనధికార లేఔట్లు, ప్లాట్లకు విద్యుత్ సౌకర్యం, నీటి సరఫరా, డ్రైనేజీ వంటి సదుపాయాలకు అనుమతి ఉండదని వెల్లడించారు. ఈ పథకాన్ని యజమానులు, రియల్టర్లు వినియోగించుకునేలా లైసెన్స్ ఇంజనీర్లు చొరవ చూపాలని జేసీ సూచించారు. ఆర్‌డిటిటిపి సంజీవ్ కుమార్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫిసర్ అంజాద్ బాష, తదితరులు పాల్గొన్నారు.