
హెచ్.ఐ.వి. డి అడిక్షన్ నివారణపై అవగాహన సదస్సు
వెలుగు కర్నూలు: కల్లూరు మండలం, ఉలిందకొండ గ్రామంలో ఏపీ సాక్స్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో, హెడ్ మాస్టర్ లీలావతి సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్.ఐ.వి., సుఖవ్యాధులు మరియు డ్రగ్ డీ-అడిక్షన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాబుణ్ణి మాట్లాడుతూ, హెచ్.ఐ.వి. వ్యాధి పట్ల యువతలో అవగాహన పెంపొందితే, హెచ్.ఐ.వి. బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. చికిత్స కంటే నివారణే మేలు అని స్పష్టం చేశారు. హెచ్.ఐ.వి. కేవలం అసురక్షిత లైంగిక సంబంధాలు, హెచ్.ఐ.వి. ఉన్న గర్భిణీ నుండి శిశువుకు, కలుషిత సూదులు-సిరంజీలు మరియు పరీక్షించని రక్తం ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని వివరించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత హెచ్.ఐ.వి. పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. హెచ్.ఐ.వి. నిర్ధారణ అయిన వారికోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న ART, లింక్ ART కేంద్రాల ద్వారా ఉచిత మందులు అందిస్తున్నారని, వీటిని వైద్యుల సూచనల ప్రకారం వాడితే ఆరోగ్య సమస్యలు లేకుండా సాధారణ జీవితం గడపవచ్చని పేర్కొన్నారు.
హెచ్.ఐ.వి. బాధితులపై వివక్ష చూపడం హెచ్.ఐ.వి./ఎయిడ్స్ చట్టం – 2017 ప్రకారం శిక్షార్హమని హెచ్చరించారు. ఎలాంటి సందేహాలైనా జాతీయ హెల్ప్‌లైన్ 1097 ద్వారా నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. కండోమ్ బాక్స్ వినియోగంపై కూడా అవగాహన కల్పించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామాల్లో ఇటువంటి అవగాహన సదస్సులు, సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని, ముఖ్యంగా యువత, మహిళలు, పొదుపు సంఘాలు, కార్మికులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జయమ్మ పి.డి., ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.