నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి : వైఎస్ జగన్
అమరావతి, న్యూస్ వెలుగు : తిరుమల (Tirumala) పర్యటనను మతం పేరుతో అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan ) తీవ్రంగా స్పందించారు. తన తండ్రి వైఎస్సార్ అనేక సార్లు తిరుమలను దర్శించుకున్నారు. నేను సీఎంగా 5సార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించా. నా మతమేందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. తిరుమల పర్యటన సందర్భంగా నెలకొన్న పరిస్థితులపై తాడేపల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా తప్పేముంది. బయటకు పోతే హిందూత్వాన్ని, ముస్లిం, సిక్కు మతాలను గౌరవిస్తా.. అనుసరిస్తానని వెల్లడించారు. తిరుమలకు వస్తానంటే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం శోచనీయమని ఆరోపించారు. ‘ నా మతం మానవత్వం. డిక్లరేషన్‌లో రాసుకుంటే రాసుకోండని’ వెల్లడించారు. . దేవుడిని దర్శించుకోవడానికి ఐదేళ్లపాటు సీఎంగా పనిచేసినా వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏమిటని, వారిని రాబోయే రోజుల్లో గుడిలోకి రానిస్తారా. అంటూ అనుమానం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి రాకముందు చంద్రబాబు హయాంలోనే చేపట్టిన పాదయాత్ర తిరుమల నుంచే మొదలు పెట్టి, తిరుమలలోనే కాలినడకన స్వామివారిని దర్శించుకున్నానని వెల్లడించారు. అప్పుడు లేని మతం డిక్లరేషన్ ఇప్పుడే ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం హిందూ ధర్మాన్ని వాడుకోవడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుకు సబబేనా అంటూ నిలదీశారు. మతాలను రాజకీయం కోసం వాడుకోవడం దౌర్భాగ్యమని అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబును ఎందుకు మందలించడం లేదని బీజేపీ అగ్రనాయకత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో గుడిల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.