
ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం : సీఎం చంద్రబాబు
అమరావతి (న్యూస్ వెలుగు): ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ… మరో బృహత్తర పథకానికి కూటమి ప్రభుత్వం నాంది పలికింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేసే పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ శనివారం ప్రారంభించారు. క్యాంప్ కార్యాలయం నుంచి ఆటోలో బయల్దేరి విజయవాడ సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వద్దకు చేరుకున్న సీఎం, ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి శ్రీకారం చుట్టారు.
కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనలో మరో పథకాన్ని ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం శనివారం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ద్వారా ఒక్కో ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.15,000లు జమ చేయడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పథకం ద్వారా 2,90,669 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.436 కోట్లు అందించాం. 15 నెలల కాలంలో సంక్షేమానికి లోటు లేదు…అభివృద్దికి తిరుగులేదు అనే ప్రజల ఆశీర్వాదం ఎంతో సంతృప్తినిచ్చిందని రాష్ట్ర అభివృద్దికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రజల దీవెనలతో ముందుకు సాగుతాం అని ముఖ్యమంత్రి తెలిపారు.