
ఐదు రోజులు భారీ వర్షాలు మత్స్యకారులను హెచ్చరించిన వాతావరణ శాఖ
అమరావతి (న్యూస్ వెలుగు): బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం రేపు మధ్యాహ్ననికి నైరుతి,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.ఆతదుపరి 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. రానున్న5రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు,ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపారు.దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం:ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ-అతిభారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం:బాపట్ల,ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ-అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.