
కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు: కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు ( న్యూస్ వెలుగు ): నగరంలోని కేసీ కెనాల్ వినాయక ఘాట్ వద్ద బుధవారం జరగనున్న కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్తీక దీపోత్సవం సందర్భంగా వేలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రజా సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ సూచించారు. ఘాట్ ప్రాంగణంలో తగిన లైటింగ్, వేదిక, సౌండ్ సిస్టం, తాగునీరు, పారిశుద్ధ్యం, గజ ఈతగాళ్లు వంటి భద్రతా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణ విషయాల్లో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సుందరమైన వాతావరణంలో కార్తీక దీపోత్సవం నిర్వహించేందుకు ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ పి.విశ్వనాథ్ పేర్కొన్నారు. అంతకన్నా ముందు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో కార్తీకదీపం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా దేవనగర్ వైపు వెళ్లే సీసీ రహదారి పనులను పరిశీలించిన కమిషనర్, రోడ్డు ఇరువైపులా గ్రీనరీ నాటాలని, ఆక్రమణలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఇంచార్జ్ ఎస్ఈ శేషసాయి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, ఎంఈ మనోహర్ రెడ్డి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, డిఈఈ గిరిరాజ్, గంగాధర్, ఏఈ భాను, తదితరులు పాల్గొన్నారు.

