
జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : ఇంచార్జి కలెక్టర్
కడప (న్యూస్ వెలుగు) : రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితులపై జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా స్థాయి, క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారీగా చెరువు కట్టలు, కాలువ గట్టుల పరిరక్షణపై దృష్టి పెట్టాలని, వాగులు, వంకలు, కుంటల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులను అప్రమత్తం చేయాలని పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. పాడి సంరక్షణకు, పశు నష్టం జరగకుండా పశు సంవర్ధక సహాయకులు బాధ్యత వహించాలని పశుసంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు.
విద్యుత్ శాఖ అధికారులు వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం అయితే వెంటనే దానిని పునరుద్ధరించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీలలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి అత్యవసర సేవలు అందించాలన్నారు. అవసరమైన మందులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అత్యవసర సహాయ సమాచార నిమిత్తం 08562 – 246344 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే పైన తెలిపిన జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ లేదా ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయానికి ఫోన్ ద్వారా తెలియజేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ సూచించారు.