
జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో ఉపశమనం
కర్నూలు (న్యూస్ వెలుగు): జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశవ్యాప్తంగా దాదాపు 83 రకాల వస్తువుల ధరలు తగ్గాయని, ఇది ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగుతుందని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ అన్నారు . సోమవారం ఆయన నాగిరెడ్డి కాలనీ, టెలికాం నగర్ కాలనీల్లో వాణిజ్య దుకాణాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపుతో ప్రజల పొదుపు గణనీయంగా పెరుగుతుందని, గతంలో నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీ వ్యవస్థను ఇప్పుడు రెండు స్లాబులకు సరళీకరించడం వ్యాపార వర్గాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల కింద 47 శాతం నిత్యావసర వస్తువులు పన్ను మినహాయింపు పొందడం సాధారణ ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. సబ్బులు, షాంపూలు, బ్రష్లు, పేస్ట్లు, చీపురులు, పప్పులు, ఉప్పు, పెన్నులు, పెన్సిల్లు వంటి వస్తువులపై పన్ను రద్దుతో ప్రతి కుటుంబానికి నెలకు ₹5,000 నుంచి ₹20,000 వరకు పొదుపు సాధ్యమవుతుందని వివరించారు. అలాగే మొబైల్ఫోన్లు, టెలివిజన్లు, ఏసీలు, కార్లు, కంప్యూటర్లు, బైక్లు వంటి వస్తువుల ధరలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు.
జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించే పన్నులను రహదారులు, రైల్వేలు, మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తోందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల వల్ల దాదాపు రూ.2 లక్షల కోట్ల ప్రజా ధనం మార్కెట్లోకి ప్రవహించనుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆర్వోలు జునైద్, వాజిద్, ఆర్ఐ రాజు, రసూల్, శివ, తదితరులు పాల్గొన్నారు.