టీజీవి కళాక్షేత్రానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

టీజీవి కళాక్షేత్రానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

కర్నూలు (న్యూస్ వెలుగు): కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో అల్లరిల్లుతున్న టీజీవి కళాక్షేత్రానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడం అభినందనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.

ఒకే సంవత్సరంలో మూడుసార్లు వరుసగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు కావడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ డాక్టర్ చనుబట్ల వెంకటాచారి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీవి కళాక్షేత్రం చైర్మన్ అయినా టీజీ వెంకటేష్ ను ఈరోజు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కళాక్షేత్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి కవులకు, రచయితలకు, కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ప్రాచీన కళలకు తగ్గిపోతున్న వైభవాన్ని తిరిగి తీసుకవచ్చేందుకు కళాక్షేత్రం కృషి చేస్తుందన్నారు. మరుపురాని మహానటుడు ఎన్టీఆర్ 101 వ జయంతి సందర్భంగా 48 గంటల పాటు నిర్విరామంగా ఎన్టీఆర్ సినిమా పాటల ప్రదర్శనను ఏర్పాటు చేయగా తొలిసారిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో టీజీవి కళాక్షేత్రం స్థానం సంపాదించిందన్నారు. అలాగే 80 మంది కళాకారులతో నాన్ స్టాప్ గా ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించి రెండోసారి రికార్డు సాధించిందని టీజీ వెంకటేష్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా వారం రోజులపాటు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా నిర్విరామంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ముచ్చటగా మూడోసారి టీజీవి కళాక్షేత్రం రికార్డుకు ఎక్కిందని ఆయన తెలిపారు. ఒకే సంవత్సరంలో మూడుసార్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కి కళాక్షేత్రం అరుదైన హ్యాట్రిక్ ను సాధించిందని ఆయన పేర్కొన్నారు. ఈ అరుదైన ఘనత సాధించడం వెనక కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మరియు ఆయన బృందం చేస్తున్నటువంటి కృషి ఎంతో ఉందని టీజీ వెంకటేష్ కొనియాడారు. ముందు ముందు కూడా కళాక్షేత్రం ఆధ్వర్యంలో మరిన్ని అరుదైన రికార్డులు సాధించాలని ఆయన కోరారు.

తెలుగు బుక్ ఆఫ్ ది రికార్డ్స్ చైర్మన్ డాక్టర్ చనబోట్ల వెంకటాచారి మాట్లాడుతూ తమ సంస్థ 28 దేశాలలో రిజిస్టర్ అయి ఉందన్నారు. తెలుగులో అరుదైన రికార్డులు సాధించిన ఘనత ఒక టీజీవి కళాక్షేత్రానికే దక్కుతుందన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో ఇప్పటికే ఎన్నో రాష్ట్ర జాతీయస్థాయి అవార్డులను కళాక్షేత్రం సొంతం చేస్తుందన్నారు. తెలుగువారి కళలను, కళాకారులను కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రోత్సహించడం ఎంతో అభినందించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కోశాధికారి కే రామస్వామి, ఇల్లూరు లక్ష్మయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!