తాగు సాగు నీరు అందించండి : సిపిఐ
నంద్యాల : నూతన కూటమి ప్రభుత్వం త్రాగునీరు సాగునీరు సమృద్ధిగా రైతులకు ప్రజలకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రామాంజనేయులు డోన్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో రామాంజనేయులు మాట్లాడుతూ అప్పటి టిడిపి ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన కె ఈ కృష్ణమూర్తి చెరువులకు సాగునీరు అందించకపోతే ప్రచారానికి రానని ప్రతిజ్ఞ చేశారు. 100 చెరువులకు నీరు అందిస్తాం అన్న మాటలు నీటి మూటలు అయ్యాయని తెలిపారు. ఇప్పుడు మరలా టిడిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినందువల్ల పడమటి ప్రాంతాలైన ఉమ్మడి కర్నూలు, పత్తికొండ, అనంతపురం, కడప ,చిత్తూరు జిల్లాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి ఈ చెరువులన్నింటికీ సాగునీటిని అందించాలని తెలిపారు. అనంతరం వచ్చిన వైసిపి ప్రభుత్వం లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన 60 చెరువులకు నీరందిస్తానని అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు కేవలం 11 చెరువులకే పరిమితమైందని అన్నారు. ఇలాంటి బూటకపు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. పత్తికొండ, డోన్ లలో ఇప్పుడు టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు కాబట్టి ఒక్క పంట కైనా సాగు నీరు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. గో రుకొల్లు రిజర్వాయర్ నుండి గ్రామాలలోని ప్రజలకు త్రాగునీటిని అందించి వెనుకబడిన డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందేలా చేయాలని అన్నారు. అనంతరం నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి మాట్లాడుతూ ఆనాటి వైసిపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఆర్భాటాల కోసం 73 చెరువులకు నిరందిస్తామని కేవలం మూడు చెరువులకు మాత్రమే నీటిని అందించి విఫలమయ్యారని తెలిపారు. ప్రస్తుతం డోన్ ఎమ్మెల్యేగా ఉన్న సూర్య ప్రకాశ్ రెడ్డి చెరువులను నింపే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. డోన్ ప్యాపిలి చెరువులకు తక్షణమే నీరు అందించే కార్యక్రమం చేపట్టాలని కోరారు. హంద్రీనీవా కాలువల నుండి నీటిని అందించి రైతులకు సాగునీరు అందించాలన్నారు. రైతులను ఆదుకోవాలన్న, గ్రామాల నుండి వలసలు ఆపాలన్నా కూడా వెనుకబడిన ప్రాంతాలకు తక్షణమే సాగునీరు త్రాగునీరు అందించి రైతులకు గ్రామాలలోని ప్రజలకు న్యాయం చేయాలన్నారు.379 కో ట్ల రూపాయలతో గోరుకల్లు రిజర్వాయర్ నుండి వచ్చే త్రాగునీరు బేతంచర్ల వరకే పరిమితమైందని ఆ నీటిని డోన్ ప్యాపిలి మండలంలో కూడా విస్తరించాలని తెలిపారు.