తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి

తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి

తిరుమల : తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి  గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకుని చక్రత్తాళ్వారు, నరసింహస్వామి , ఆంజనేయ స్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హార‌తి ఇచ్చారు.

స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి  అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేయగా మ‌హావిష్ణువు ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేసిన పద్మనాభ మహర్షిని ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి స్వామివారిని ప్రార్థించాడు. స్వామి ప్రత్యక్షమై తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు.

అనంతరం ఆ మహర్షి సుదర్శన చక్రాన్ని ఇక్కడే ఉంచి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరడంతో తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే  ఉంచడంతో  ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచిందని అర్చకులు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!