దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహా నాయకుడు మోదీ: పవన్ కళ్యాణ్

దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహా నాయకుడు మోదీ: పవన్ కళ్యాణ్

కర్నూలు(న్యూస్ వెలుగు): జీఎస్టీ 2.0 సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే సంస్కరణ

• ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ప్రయోజనం
• ఆత్మ నిర్భర భారత్ తో దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన నాయకుడు మోదీ
• పెట్టుబడులు రావాలంటే ప్రభుత్వాలపై నమ్మకం ఉండాలి
• కూటమి ఆధ్వర్యంలో 15 ఏళ్లపాటు స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలి
• సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

‘దేశంలో పన్నుల భారం పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గిన దాఖలాలు ఉండవు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. విద్యా, వైద్యం ఖర్చుల భారం నుంచి ప్రజలకు ఊరట లభిస్తుంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జీఎస్టీ 2.0తో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 20 వేల వరకు ఆదా అవుతుందన్నారు. ఆత్మ నిర్భర భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెట్టిన మోదీ కృషితో దేశంలో, రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లు వెల్లువెత్తుతున్నాయన్నారు.

 

గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయని తెలిపారు. ఎలాంటి ఫలితం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పని చేస్తున్న కర్మ యోగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అభివర్ణించారు. కర్నూలు నగర శివారు నన్నూరు వద్ద నిర్వహించిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ , రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ , ముఖ్యమంత్రి చంద్రబాబు , కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలసి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభకు హాజరైన ఆశేష జనవాహినిని ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్తున్న శ్రీ నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండడం మన అదృష్టం. మోదీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను ముందుకు నడుపుతున్నారు. భావి తరానికి మార్గదర్శనం చేస్తున్నారు. దేశం తలెత్తుకొనేలా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకువచ్చారు. మేము సేవకులం మాత్రమే కాదు అవసరం అయితే ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తామని చాటి చెప్పారు. భారత్ అగ్రగామి.. ఎవరికీ భయపడే దేశం కాదని చేతల ద్వారా తెలియ చెప్పారు.

ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్తాము
ఒక దేశపు జెండా ఎలా పౌరుషంగా ఉంటుందో.. అలాగే మన దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ ఈ రోజున మన రాష్ట్రానికి విచ్చేసి రూ. 13 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒక్క ఓర్వకల్లు పారిశ్రామికవాడలోనే రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు రావాలి అంటే ప్రభుత్వాలపై నమ్మకం ఉండాలి. కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి. పెట్టుబడులు పరిశ్రమల నమ్మకాన్ని సడలించకుండా అంతా కలిసి ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తున్నట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!