
పన్ను వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు
న్యూస్ వెలుగు కర్నూలు : నగరపాలకకి ప్రధాన ఆర్థిక వనరైన పన్నుల వసూళ్లలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణతో కలిసి రెవెన్యూ అధికారులు, అడ్మిన్ కార్యదర్శులతో పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సర ముగిసే నాటికి బకాయిలు ఉన్న ఆస్తి పన్నులను వెంటనే వసూలు చేయాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించిన సంబంధిత వారిపై చర్యలు తప్పవన్నారు. మొండి బకాయిల జాబితా అధికంగా ఉన్న అధికారులు, అడ్మిన్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అడ్మిన్‌లు సహచర కార్యదర్శులతో కలిసి ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీల వసూళ్లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. భౌగోళిక సమాచార వ్యవస్థ ఆధారంగా ఆస్తి పన్నులను క్రమబద్ధీకరించాలని, జాప్యం చేయోద్దని పేర్కొన్నారు.
అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీల మొండి బకాయిలను వెంటనే రాబట్టాలని, మొండిదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ స్పందన రాకపోతే చట్టప్రకారం నడుచుకోవాలని అదనపు కమిషనర్ సూచించారు.
కార్యక్రమంలో ఆర్వో వాజిద్, ఆర్‌ఐ జిఎం శ్రీకాంత్, తిప్పన్న, సుహైల్, రాజు, శివశంకర్, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.