
ప్రజలు ఛీ కొట్టినా వైసీపీ నాయకులు మారడం లేదు.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
కర్నూలు (న్యూస్ వెలుగు): రాష్ట్ర ప్రజలు ఛీకొట్టినా వైసీపీ నేతలు మారడం లేదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. నగరంలోని పాత బస్టాండులోని అంబేద్కర్ విగ్రహానికి కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ అందరికీ స్పూర్తి అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే తప్పుచేయడానికి కూడా ఆలోచించే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజలు వైసీపీ నేతల ఆగడాలన్నీ గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
