బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఖచ్చితమైన నిబంధనలు పాటించాలి: కలెక్టర్ 

బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఖచ్చితమైన నిబంధనలు పాటించాలి: కలెక్టర్ 

కర్నూలు (న్యూస్ వెలుగు): ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు మరియు డయాగ్నస్టిక్ సెంటర్లు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కాలుష్య నియంత్రణ చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి మాట్లాడుతూ…పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆసుపత్రులు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోగులు, సిబ్బంది మరియు ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వైద్య వ్యర్థాలను సక్రమంగా వేరు చేసి, శాస్త్రీయ పద్ధతిలో నిర్వర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు.ఆసుపత్రులలో కాలం చెల్లిన మందులను సక్రమంగా ధ్వంసం చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అటువంటి మందులను సాధారణ చెత్తతో కలిపి పారబోసినట్లయితే పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందని హెచ్చరించారు.

 

బయో మెడికల్ వేస్ట్ సొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రతినిధితో వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నాలుగు వాహనాల ద్వారా అన్ని ఆసుపత్రుల నుండి వేస్ట్ కలెక్ట్ చేసుకుని నిర్వీర్యం చేస్తామని ప్రతినిధి కలెక్టర్ కు తెలియజేశారు. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ను ఫోన్ ద్వారా ఏ విధంగా బయోమెడికల్ వేస్ట్ ను నిర్వీర్యం చేస్తున్నారన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

అలాగే ఆసుపత్రుల చెత్తను సరైన విధంగా వేరు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. రెడ్, యెల్లో, బ్లూ, వైట్ రంగుల బయో కోడింగ్ బ్యాగులు ఉపయోగించి ఇంజెక్షన్ సూదులు, పత్తి, గ్లౌవ్స్, శరీర వ్యర్థాలు వంటి బయోమెడికల్ వ్యర్థాలను వేర్వేరు సంచుల్లో వేరు చేయాలని సూచించారు.ఇది వ్యర్థాల శాస్త్రీయ నిర్వాహణకు కీలకమని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా, ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్ తమ వద్ద ఉత్పత్తి అయ్యే బయోమెడికల్ వ్యర్థాల వివరాలను బయోమెడికల్ వేస్ట్ మానేజ్మెంట్ యాప్ లో ప్రతిరోజూ డేటా ఎంట్రీ చేయడం తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు. డేటా ఎంట్రీ చేయని సంస్థలపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ “చెత్తను వేరు చేసే ముందు ఆలోచించండి” అనే గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిషోర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ భాస్కర్, చంద్రమోహన్ రెడ్డి పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ,డాక్టర్ జఫ్రుల్లా డిసిహెచ్ఎస్,డాక్టర్ వెంకటేశ్వర్లు జి జి హెచ్ సూపరింటెండెంట్ , డాక్టర్ వేణుగోపాల్ ఐఎంఏ ప్రతినిధి, కర్నూలు ఆదోని,ఎమ్మిగనూరు,గూడూరు మున్సిపల్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS