
రాష్ట్రంలో ఎటు చూసినా దాడులు దోపిడీలే…!
న్యూస్ వెలుగు తాడేపల్లి: కూటమి ప్రభుత్వ 14 నెలల పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, రాష్ట్రంలో ఏమూలన చూసినా హత్యలు, దాడులు, దోపిడీలు నిత్యకృత్యం అయ్యాయని వైయస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ నేతృత్వంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై దిశా నిర్దేశం చేశారు.
అనంతరం సమావేశం వివరాలను కాకుమాను రాజశేఖర్ మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వాటిని వైయస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని చెప్పారు. చంద్రబాబుకి పాలన చేతకావడం లేదన్న రాజశేఖర్, ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వైయస్సార్సీపీ హయాంలో కులమతాలు, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తే, చంద్రబాబు మాత్రం పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.