
శివసేన (యూబీటీ) శాసనసభా పక్ష నేతగా ఆదిత్య ఠాక్రే
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) శాసనసభా పక్ష నేతగా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ఎన్నుకున్నారు. అసెంబ్లీలో ఆ పార్టీ గ్రూప్ నేతతోపాటు పార్టీ చీఫ్ విప్ పదవులను భర్తీ చేశారు. సోమవారం ముంబైలో శివసేన (యూబీటీ) శాసన సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆదిత్య ఠాక్రేను ఎన్నుకున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ గ్రూప్ లీడర్‌గా మాజీ మంత్రి భాస్కర్ జాదవ్, పార్టీ చీఫ్ విప్‌గా సునీల్ ప్రభు ఎన్నికయ్యారు. శివసేన (యూబీటీ) శాసనసభ్యుల సమావేశం తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత అంబాదాస్ దన్వే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి ఆదిత్య ఠాక్రే పోటీ చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన మిలింద్ దేవరాపై 8,801 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో 67,427 ఓట్ల మెజార్టీతో ఆదిత్య ఠాక్రే గెలిచారు. ఈ ఓట్ల మార్జిన్ ఈసారి బాగా తగ్గింది.