సంపద, ఉపాధి సృష్టించ గల సమర్థుడు చంద్రబాబే
• రాష్ట్ర బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత
• పరిగి మండల కేంద్రంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి
• ఇంటింటికీ వెళ్లి స్వయంగా పెన్షన్ల పంపిణీ
పెనుకొండ,న్యూస్ వెలుగు : సంపద, ఉపాధి సృష్టించ గల సమర్థ నాయకుడు సీఎం చంద్రబాబేనని రాష్ట్ర బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ, చేనత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజలంతా మూడో సారి పండగ చేసుకుంటున్నారని, ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయ డంతో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొందని ఆమె తెలిపారు. శనివారం పరిగి మండలం కేంకరంలో ఎస్సీకాలనీ, పోయగేరి కాలనీ, సీతారాం కాలనీలో మంత్రి సవిత స్వయంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతోనూ, స్థానిక ప్రజలతోనూ మంత్రి మాట్లాడారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో, లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఒక రోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పెన్షన్లదారులకు రూ.3 వేల కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు మూడో సారి పండగ చేసుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రూ.వెయ్యిలు పెంచుతూ, జులైలో రూ.7 వేలు, ఆగస్టులో 4 వేలు అందజేశామన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం పడడంతో, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకూడదని ఇపుడు 4 వేలు చొప్పున లబ్ధి దారుల కు పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లోకి వెళుతున్న తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పూల వర్షం కురిపిస్తున్నారని మంత్రి ఆనందం వ్యక్తంచేశారు. సంపద సృష్టించాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా అది ఒక్క సీఎం చంద్ర బాబు నాయుడికే సాధ్యమన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలోనే రాజధాని పనులు, పోలవరం పనులు ప్రారంభమయ్యాయన్నారు. అన్ని శాఖల్లోనూ అభివృద్ధిని చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నా పెన్షన్ దారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారన్నారు.
ఇక అన్నీ మంచిరోజులే ..
గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదని మంత్రి సవిత మండిపడ్డారు. ఏ శాఖను చూసినా అప్పులే కనిపిస్తున్నాయన్నారు. చేసిన అప్పులంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లినట్లు న్నయన్నారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయాయన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మొదటి రోజు నుంచే రాష్ట్రాన్ని, వ్యవస్థలను గాడిలో పెడుతూ సంపద సృష్టించి పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైల్ పై చేశారన్నారు. ఎక్కడికి వెళ్లినా మళ్లీ … మళ్లీ… చంద్రబాబే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి వెల్లడించారు.
మీ వల్లే మంత్రి పదవి…
అంతకుముందు పరిగిలో ప్రజలనుద్దేశించి మంత్రి సవితమ్మ మాట్లాడారు. జిల్లాలో తనకు అత్యధిక మెజార్టీ రావడానికి కారణం పరిగి మండల వాసులేనని మంత్రి తెలిపారు. మీరిచ్చిన మెజార్టీ వల్లే ఈరోజు తాను మంత్రి పదవిలో ఉండగలిగానని, అందుకు మండల వాసులకు రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. ఇప్పటికే నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలో పెనుకొండ వ్యాప్తంగా పనులు ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు.
చంద్రబాబు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి..
పరిగి మండలం కేంకరంలో ఎస్సీకాలనీ, పోయగేరి కాలనీ, సీతారాం కాలనీలో మంత్రి సవిత స్వయంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. పేరు పేరునా లబ్ధిదారులను పలుకరిస్తూ వారితో మాట్లాడారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ఎంత పెన్షన్ వస్తోంది… ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ, పెన్షన్ పెంపు వల్ల తమకు ఆర్థిక కష్టాలు తీరాయని ఆనందం వెలిబుచ్చారు. మందులకు, సొంత ఖర్చులకు బంధువులపై ఆధారపడాల్సిన దుస్థితి తప్పిందన్నారు. చంద్రబాబుకు తామంతా రుణ పడి ఉంటామని తెలిపారు. చంద్రబాబు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మంత్రికి ఓ వృద్ధురాలు ఆశీర్వ చనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.