
సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం
న్యూస్ వెలుగు అమరావతి: సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 9 ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేశారు. రాజధాని అమరావతిలో చేపట్టే వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుకు సీఆర్డీఏ అథారిటీ తన ఆమోదాన్ని తెలియచేసింది. రాజధానిలో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు, స్పోర్ట్స్ సిటీ , స్మార్ట్ ఇండస్ట్రీస్, రివర్ ఫ్రంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, రోప్ వే లాంటి ప్రాజెక్టులకు ఈ ఎస్పీవీ పని చేస్తుంది. భూసమీకరణ పథకం కింద ఇచ్చే యాజమాన్య ధృవీకరణ సర్టిఫికెట్‌లో అసైన్డ్ అనే పదాన్ని తొలగిచేందుకు కూడా సీఆర్డీఏ అథారిటి ఆమోదాన్ని తెలిపింది. అమరావతి రాజధాని నగరంలో సివరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రూ. 411 కోట్లు, అలాగే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను రూ. 376.60 కోట్లతో ఏర్పాటు చేసేందుకు అథారిటీ అంగీకరించింది. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు కూడా అదనపు భూ కేటాయింపులు చేసేందుకు సీఎం అధ్యక్షతన అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.