సీఎం సహాయ నిధికి రు.50 లక్షల భారీ విరాళం
నంద్యాల న్యూస్ వెలుగు : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా పొదుపు లక్ష్మి మహిళలు ముందుకు వచ్చారని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాలులో స్వర్ణాంధ్ర@2047 జిల్లా దార్శినిక పత్ర రూపకల్పనలో భాగంగా జిల్లాలోని పొదుపు లక్ష్మి మహిళలు 50 లక్షలు జమ చేసి చేసిన మొత్తంలో మొదటి దఫా 20 లక్షల రూపాయలను శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారన్నారు. జిల్లాలోని అన్ని మండలాలలోని పొదుపు లక్ష్మి మహిళలందరూ తమ వంతు వితరణగా 50 లక్షల రూపాయల మొత్తాన్ని జమ చేశారన్నారు. ఇందులో భాగంగానే మిగిలిన 30 లక్షల రూపాయలను సీఎం సహాయనిధికి అందజేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు జిల్లా తరఫున దాతలు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారని కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు దాతలు విరాళాలు ఇచ్చిన మొత్తాల కంటే పేదలైన పొదుపు లక్ష్మి మహిళలు మానవతా దృక్పథంతో తమ వంతు వితరణను భారీగా సేకరించి జిల్లా తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలను అందజేయడం హర్షనీయమని కలెక్టర్ తెలిపారు.