
సెప్టెంబరులో జనగణన ?
న్యూఢిల్లీ : సుదీర్ఘకాలంగా అలస్యమవుతూ వచ్చిన జనగణన కార్యక్రమంలో సెప్టెంబరులో ప్రారంభం కానుందని సంబంధిత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2021లో ఈ జనాభా లెక్కల సేకరణ జరగాల్సి వుంది. వచ్చే నెల్లో ప్రారంభం కానున్న ఈ బృహత్తర ప్రక్రియ పూర్తి కావడానికి 18మాసాలు పడుతుంది. కోవిడ్ కారణంగా తొలుత వాయిదా పడింది. అయితే ఆ తర్వాత ఈ ప్రక్రియను చేపట్టకుండా మోడీ ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. దశాబ్దానికోసారి చేపట్టే ఈ జనగణన ఇలా జాప్యం జరగడం 150ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి.
జనాభా లెక్కలు చేపట్టడంలో జరుగుతున్న జాప్యంపై ఆర్థికవేత్తల నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
దీని వల్ల ఇతర గణాంక సర్వేల కచ్చితత్వంపై కూడా ప్రభావం పడుతోందని వారు పేర్కొన్నారు. ఆర్థిక ప్రామాణికాలు, ద్రవ్యోల్బణ రేట్లు, ఉపాధి గణాంకాలు వంటి కీలకమైన డేటాలు ఇందులో వున్నాయి. ప్రస్తుతం, 2011లో నిర్వహించిన జనాభా లెక్కల డేటా పైనే ఈ సర్వేలు, ప్రభుత్వ కార్యక్రమాలు చాలావరకు ఆధారపడుతున్నాయి.
ఈ జనగణన ఫలితాలు 2026 మార్చిలో వెలువడే అవకాశం వుంది.
దీనిపై కేంద్ర హోం శాఖ, గణాంకాల మంత్రిత్వ శాఖలు టైమ్‌లైన్‌లను రూపొందించాయి. అయితే ఇంకా ప్రధాని కార్యాలయం అధికారికంగా అనుమతినివ్వాల్సి వుందని ఆ వర్గాలు తెలిపాయి.
జనగణన ఆలస్యమవడంతో కలిగే ప్రభావాలు ఆధునిక జనాభా లెక్కల డేటా లేకపోవడంవల్ల మరో 15 కీలకమైన ఇతర డేటా సెట్‌లు కూడా ఆలస్యమమయ్యాయి. వీటిల్లో ఆరోగ్యం, జనాభా, ఆర్థిక రంగాలకు సంబంధించినవి వున్నాయి. దీనికి తోడు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) చేపట్టే సర్వేల నాణ్యత కూడా దెబ్బతింటోంది.
2021లో మోడీ ప్రభుత్వం జనగణన నిర్వహించలేకపోవడంతో, ఆధునీకరించబడిన గణాంకాలు
కొరవడిన కారణంగా దాదాపు 10కోట్ల మంది ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కు బయటనే వుండిపోయారు. తాజా జనగణన జరగకపోవడం వల్ల 80కోట్ల జనాభా దగ్గరే మనం ఆగిపోవడం దురదృష్టకరమని ఆర్థికవేత్త రితికా ఖెరా వ్యాఖ్యానించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 50శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం జనాభాకు పిడిఎస్ వర్తిస్తుంది. ఆ లెక్క ప్రకారం అప్పుడు ఆ సంఖ్య 80కోట్లని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈనాడు జనగణన చేపడితే దాదాపు పది కోట్ల మంద్రి ప్రజలు అదనంగా పిడిఎస్ లబ్దిదారులుగా చేరతారని ఆమె పేర్కొన్నారు.
ఆహార భద్రతే కాకుండా
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) కూడా ఈ డేటా కొరత వల్ల తీవ్రంగా ప్రభావితమవుతోంది. రాష్ట్రంలో కుటుంబాలు, కార్మికుల సంఖ్య ఆధారంగా ప్రతి రాష్ట్రానికి నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సి వుంటుంది.
అలాగే ఎస్‌సి, ఎస్‌టి వర్గాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన వివిధ పథకాలకు
నిధులు కేటాయించడంలో, వృద్ధాప్యపు పెన్షన్లు ఇవ్వడం, పేదలకు గృహ నిర్మాణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. వీటన్నింటికీ ఆధునీకరించిన డేటా లేకపోవడమే ప్రధాన కారణంగా వుంది.
సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్దిదారులెవరూ దూరం కాకుండా
వుండేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వంత డేటా సెట్ కోసం నిధులను ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.