ట్రెండ్ సెట్టర్ గా బాలయ్య

ట్రెండ్ సెట్టర్ గా బాలయ్య

న్యూస్ వెలుగు సినిమా :

ట్రెండ్ సెట్టర్ గా బాలయ్య..
వరుస బ్లాక్‌బ‌స్ట‌ర్స్ వెనుక ఉన్నది ఆమెనే..!

నందమూరి నట సింహం బాలకృష్ణకు మాస్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఆయన మాస్ డైలాగ్స్, మాస్ యాక్షన్ ను ఎంజాయ్ చేసేందుకే సినిమాలు చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఇక సాంగ్స్ లో ఆయన వేసే స్టెప్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి జోరు ప్రదర్శిస్తున్నారు. నిజానికి బాలయ్య కెరీర్ లో పీక్ స్టేజి అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు విడుదలైన టైం అనే చెప్పాలి. ఆ రేంజ్ లో మళ్లీ ఇప్పుడు బాలయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. సీనియర్ హీరోల్లో బాలయ్య వరుసగా నాలుగు హిట్లు కొట్టడం అంటే రేర్ ఫీట్ అని చెప్పొచ్చు.

అఖండతో మొదలైన బాలయ్య తాండవం తాజాగా విడుదలైన డాకు మహారాజ్ చిత్రంతో కూడా కొనసాగుతోంది. డాకు మహారాజ్ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా బాలయ్య నాలుగు హిట్లు అందుకున్నారు.

సింహా ముందు వరకు బాలయ్య నటించిన చాలా చిత్రాలు ట్రోలింగ్ కి గురయ్యాయి. సింహా తర్వాత పరిస్థితి మెరుగుపడింది. ఇక అఖండ తర్వాత బాలయ్యలో స్పష్టమైన మార్పు మొదలయింది. బాలయ్య లో ఇంత మార్పుకి కారణం ఏంటి ? వరుస హిట్లు ఎలా సాధ్యం అవుతున్నాయి అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ గతంలో డైరెక్టర్లని గుడ్డిగా నమ్మేవారు. అందుకు ఉదాహరణ ఒక్క మగాడు చిత్రం. కథ కూడా వినకుండా వైవిఎస్ చౌదరి తమ ఫ్యామిలీకి అభిమాని అని బాలయ్య ఆ చిత్రం చేశారు. రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. ఆలాంటి సిల్లీ కథలతో బాలయ్య చాలా చిత్రాలు చేశారు. కానీ అఖండ నుంచి బాలయ్య దర్శకులని గుడ్డిగా నమ్మడం లేదు. బాలయ్యలో వచ్చిన ప్రధానమైన మార్పు ఇదే. కథా చర్చల్లో బాలయ్య బాగా ఇన్వాల్వ్ అవుతున్నారట. భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాల్లో బాలయ్య స్వయంగా కొన్ని ఐడియాలు ఇచ్చారట. అవసరమైన మార్పలు సూచించారు. తన ఫ్యాన్స్ కి ఏమి కావాలి అనేది బాలయ్య డైరెక్టర్లకి చెబుతున్నారు.

బాలయ్యలో వచ్చిన మరో మార్పు ఏంటంటే.. ట్రెండుకి తగ్గట్లుగా యువ దర్శకులని ఎంచుకోవడం. అవుట్ డేటెడ్ డైరెక్టర్లని పక్కన పెట్టేసి తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా తెలిసిన బోయపాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే విధంగా గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ లాంటి యువ దర్శకులని బాలయ్య ఎంచుకుంటున్నారు. తాను ఎంచుకునే కథల విషయంలో బాలయ్య తన చిన్న కుమార్తె తేజస్విని అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నారట. ఇటీవల తేజస్విని తన తండ్రి సినిమాల కథల ఎంపిక, ఇతర విషయాలని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బాలయ్య వరుస హిట్లు కొడుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.

అంతేకాదు తండ్రి మీద వస్తున్న ట్రోల్స్, ఆయన్ని కావాలని టార్గెట్ చేస్తూ పబ్లిక్‌లో జరుగుతున్న విష ప్రచారాన్ని అంతం చేసేందుకు అన్ స్టాపబుల్ షోని తీసుకొచ్చింది తేజస్వినీ. ఈ షో కారణంగా అప్పటిదాకా బాలయ్య అంటే అరుస్తాడు, అభిమానులను కొడతాడని మాత్రమే తెలిసిన జనాలకు నిజమైన బాలయ్య క్యారెక్టర్ తెలిసింది. తన కంటే వయసులో చిన్నవాళ్లను కూడా ఎంతో అప్యాయంగా పలకరిస్తూ, వారిని గౌరవిస్తూ బాలయ్య, ఈ షోని హోస్ట్ చేసిన విధానం.. ఆయన్ని చాలా మందికి దగ్గరివాడిగా మార్చింది..

నిజానికి టాలీవుడ్‌లో సీనియర్ హీరోల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కానీ సీనియర్ హీరోల్లో వరుసగా విజయాలు అందుకోవడమే కాకుండా నేటి తరం యూత్‌లో తనకంటూ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో బాలయ్యే..
బాలయ్య కెరీర్‌ డేంజర్‌లో ఉందని ఫ్యాన్స్ ఫీలైన పొజిషన్ నుంచి, బాలయ్య వల్ల చాలా మంది కుర్ర హీరోల ఫ్యూచర్‌ డేంజర్‌లో పడిందనే పొజిషన్‌కి చేరుకున్నాడు. ఇకపై కూడా ఇదే విధమైన దూకుడు చూపిస్తే, బాలయ్య 3.0.. ఆయన్ని పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS