విజయవాడ: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వరద ప్రభావంతో అతలాకుతలమైన ప్రతి కుటుంబానికీ నిత్యావసరాలను అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

శుక్రవారం ఉదయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల కిట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ ను గురువారం సాయంత్రం విజయవాడలో నిర్వహించారు. మనోహర్ తోపాటు పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని పంపిణీ విధానాన్ని పరిశీలించారు. సింగ్ నగర్ ప్రాంతంలోని రామకృష్ణాపురంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్ ముంపు బాధితుల ఇళ్లకు వెళ్ళి వారిని పరామర్శించి నిత్యావసరాలతో కూడిన కిట్లు అందించారు. వరదల వల్ల ప్రభావితం అయిన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, ఒక లీటరు వంటనూనె, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండు కేజీల బంగాళ దుంపలు పౌర సరఫరాల శాఖ ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “గతంలో ఎన్నడూ లేనివిధంగా వచ్చిన ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు, లక్షలాది ప్రజలు ప్రభావితం అయ్యారన్నారు.

విజయవాడ ప్రాంతంలో చాలా నష్టం జరిగిందని వారు అన్నారు.

ఇప్పుడిప్పుడే వరద బాధల నుంచి కోలుకుంటున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని నిర్ణయించిందన్నారు . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో వరద బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా నిలిచేలా నిత్యావసర వస్తువులు అందించాలని నిర్ణయించామన్నారు . ఒక కిట్ రూపంలో రాష్ట్రంలో వరద ప్రభావితం అయిన ప్రతి కుటుంబానికి ఇవి అందుతాయని తెలిపారు. మొదటగా విజయవాడ నుంచి ఈ పంపిణీ ప్రారంభించి ప్రతి ఇంటికీ వెళ్లి ఈ కిట్ ను ప్రభుత్వ సిబ్బంది వరద బాధితులకు అందిస్తారని తెలిపారు.
Thanks for your feedback!