కలెక్టర్ల సదస్సులో పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
అమరావతి : ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పవన్‌కల్యాణ్ మాట్లాడారు. అధికారులు వ్యవస్థలను బలోపేతం చేయాల్సి ఉండగా నిస్సహాయత వ్యక్తం చేస్తే సామాన్య మానవుడు ఎవరి వద్దకు వెళ్తారని తెలిపారు.
ఏపీలో పరిపాలన ఆదర్శవంతంగా ఉండి ప్రశంసించేలా ఉండాలే తప్పా ఎలా ఉండకూడదో చేసి నిరూపించుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అధికారుల సహకారం కావాలని అన్నారు. గత ప్రభుత్వ చేసిన పనులన్నీ మూలలను కదిలించే స్థాయికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వాటి మూలాల నుంచి తొలగించే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
అధికారులు మౌనం వహించడం వల్లే రాష్ట్రం రూ.10 లక్షల కోట్లు అప్పులు మిగిలాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తాము చేయగలమని,వాటిని సమర్దవంతంగా ప్రజల వద్దకు తీసుకెళ్లే గురుతర బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు చెక్‌పోస్టులను ఏర్పరచినా కూడా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ జరుగుతుంటే ఎవరిని నిందించాలని అన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.