
మన్మోహన్‌సింగ్ మరణం పట్ల చంద్రబాబు విచారం
అమరావతి : మాజీ ప్రధాని , ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ జీ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మన్మోహన్‌సింగ్ గొప్ప ఆర్థిక రాజనీతిజ్ఞుడని కొనియాడారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా ఎదిగి దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విచారం వ్యక్తం చేశారు. అతని దూరదృష్టి విధానాలు, ఆర్థిక సంస్కరణలు భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగడానికి పునాది వేసిందని జగన్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధాకరమని షర్మిల అన్నారు. భారత దేశ ఆర్థికశిల్పి మరణం దేశానికి తీరని లోటని వివరించారు. రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా, అంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, మన దేశానికి అందించిన సేవలు అమూల్యమని అన్నారు.