కుంభోత్సవ ఏర్పాట్లు పూర్తి : ఏవో

కుంభోత్సవ ఏర్పాట్లు పూర్తి : ఏవో

శ్రీశైలం న్యూస్ వెలుగు : ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారము లేదా శుక్రవారాలలో (ఏ రోజు ముందు వస్తే ఆరోజు) శ్రీశైల క్షేత్రంలో ఈ కుంభోత్సవం జరుగుతుంది. ఉత్సవం సందర్భంగా పలు రకాల పుష్పాలతో, నిమ్మకాయదండలతో, వేపమండలతో అలంకరించబడిన దేవాలయాన్ని దర్శించుకునేందుకు స్థానికులు ఎంతో ఉత్సాహాన్ని చూపుతారు. ఊరంతా కలిసి ఊరి పండుగగా జరుపుకునే ఈ ఉత్సవం సకల శుభాలను అనుగ్రహిస్తుందని శ్రీశైల వాసుల తరతరాల విశ్వాసం. చెంచులుగా పిలువబడే ఇక్కడి స్థానిక గిరిజనులు భ్రమరాంబాదేవిని తమ ఆడపడుచుగా, స్వామివారిని తమ అల్లునిగా భావిస్తారు. అందుకే చెంచులు కుంభోత్సవం తమ ఇంటి పండుగా భావించి, ఆనందోత్సవాలతో ఈ ఉత్సవంలో పాల్గొంటారు.

స్వాతికబలి సమర్పణే కుంభోత్సవం

పెద్దసంఖ్యలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు అన్నపురాశులను శక్తిస్వరూపిణియైన భ్రమరాంబ దేవికి స్వాతికమైన పద్ధతిలో బలిని సమర్పించడమే ఈ ఉత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఉత్సవంలో భాగంగానే ఈరోజు శ్రీశైల గ్రామ దేవత అంకాలమ్మకు, ఇంకా క్షేత్ర పరిధిలో అమ్మవారిని విగ్రహాల వద్ద ప్రత్యేక పూజాదికాలు జరిపించబడతాయి. అర్చకులు ముందుగా అమ్మవారికి యథావిధిగా ప్రాతఃకాలపూజలన్నీ నిర్వహించిన తరువాత నవవరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ అష్టోత్తరపూజలు, జపపారాయణం గావిస్తారు. ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంత సేవగా నిర్వహింపబడుతాయి. ఆలయ దక్షిణప్రాకార కుడ్యము పై గల మహిషాసురమర్దిని అమ్మవారికి పూజాదికాలు చేసి, 108 కొబ్బరికాయలను సమర్పిస్తారు దీనికే కోటమ్మపూజ అని పేరు. తరువాత అమ్మవారి ముఖమండపం ప్రవేశద్వారం దగ్గర రజకులు ప్రత్యేకమైన పసుపు కుంకుమలతో ఎంతో ఆకర్షణీయంగా ముగ్గును వేస్తారు. దీన్నే చాకలి ముగ్గు అని పిలుస్తారు. వేయడం పూర్తి కాగానే అర్చకులు శ్రీ చక్రానికి ప్రదక్షిణ మండపంలో అమ్మవారికి ఎదురుగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలపై పసుపు కుంకుమలను చెల్లి మొదటి బలిని సమర్పిస్తారు. దాంతో భక్తులు నగారా, జేగంట, కొమ్ము, శంఖనాదాలను మ్రోగిస్తారు అమ్మ వారి నామస్మరణ చేస్తూ వసంతం నింపిన గుమ్మడికాయలను, నేలకేసి గట్టిగా కొడుతూ, నిమ్మకాయలను సగానికి కోస్తూ బలిని వేస్తారు.

ఓవైపు అమ్మవారికి కుంభోత్సవం జరుగుతుంటే మరోవైపు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, సర్వదర్శనం నివేదనలు మొదలైనవన్నీ యథావిధిగా జరుపబడతాయి. ఆరోజు స్వామి వారికి ప్రదోషకాలపూజలయ్యాక, పెరుగు కలిపిన అన్నాభిషేకంతో స్వామి వారి మూలమూర్తిని పూర్తిగా కప్పి వేస్తారు. అనంతరం అమ్మవారికి ఉత్తర పూజలు చేసి 9 రకాల పిండివంటలను నివేదించడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది.

ఆరాధన మూడురకాలు. అవి సాత్విక, రాజస, తామసిక విధానాలు. సాత్వికరూపంలో దేవీదేవతలకు పరమాన్నం, పులిహోర వంటి నైవేద్యాలను తృప్తి పరుస్తారు. గుమ్మడి, కొబ్బరి వంటివి బలిఇస్తారు. రక్తానికి సూచికగా ఆలయాల్లోని ధ్వజస్తంభాల వద్ద కుంకుమ కలిపిన అన్నం సమర్పిస్తారు. ఉగ్రంగా ఉండే దేవతలు రాజసమూర్తులు. ఈ రాజసమూర్తులకు జంతుబలులనిస్తారు. తామసదేవతలు కూడా మహోగ్రంగానే ఉంటారు. వారి ఆరాధనా విధానాల్లో మద్యం వంటివి సైతం వినియోగిస్తారు. తామసిక ఆరాధన అందరికీ ఆమోదయోగ్యమైనది కాదు. ఈ మూడు ఆరాధనా విధానాల్లో శ్రేష్ఠమైనది సాత్త్విక విధానం. ప్రధానంగా శాక్తేయంలో రాజస, తామస మూర్తులను కూడా సాత్త్విక పద్ధతుల్లో ఆరాధించి చక్కని ఫలితాలను పొందవచ్చని ఎందరో నిరూపించారు.

అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబ నిజానికి మహోగ్ర మూర్తి. అరుణాసురుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి అమ్మవారు భ్రమర రూపాన్ని పొందింది. దేవతలందరూ కూడా భ్రమరాలుగా మారారు. భ్రమరీ రూపంతో వెళ్ళి కాళ్ళతో, తొండంతో, హృదయాన్ని ఛేదించి ఆయువుపట్లని త్రుంచేసింది. దానితో అరుణాసురుడు మరణించాడు. భ్రమరాంబ ఆలయం వెనుక నేటికీ తుమ్మెదల ఝంకారం వినిపిస్తుంది. మహిషిరూపంలోని అరుణాసురుని శిరస్సుపై శూలాన్ని గుచ్చుతున్నట్లు కనిపించే భ్రమరాంబ నిజరూపాన్ని దర్శించడానికి ధైర్యం చాలదు. ఆదిశంకరులు భ్రమరాంబ ఆలయంలో శ్రీచక్రప్రతిష్ఠ చేసి భ్రమరాంబ ఉగ్రత్వాన్ని తగ్గించారు. అయినప్పటికీ భ్రమరాంబ ఆలయంలో కొన్ని ప్రత్యేక సందర్భాలలో బలులు ఇచ్చే ఆచారం ఉండేది. ముఖ్యంగా ఉగాది తరువాత వచ్చే మూడో శుక్రవారంనాడు చెంచులు అమ్మవారికి బలులు సమర్పించారు. బలులపై నిషేధం వచ్చిన తరువాత ఈ బలిసమర్పణ విధానాన్ని పూర్తి సాత్విక పద్దతుల్లోకి మార్చారు. అదే శ్రీశైలక్షేత్రంలో వార్షిక కుంభోత్సవం.

శ్రీశైల మహాక్షేత్రంలో ఉత్సవ వాతావరణం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. అయిదు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, వాహనసేవలు ఉంటాయి. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుంచి వేలాది భక్తులు ఉగాది నాటికి నడకదారిలో శ్రీశైలం చేరుకుంటారు. ఉగాది ఉత్సవాల అనంతరం వచ్చే మంగళ, శుక్రవారాలను వార్షిక కుంభోత్సవాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఉగాది తరువాత మూడో మంగళ, శుక్రవారాల్లో ఏది ముందుగా వస్తే ఆరోజున కుంభోత్సవం జరపడం ఆనవాయితీ.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS