అందరి ఆరాధ్య దేవుడు బొజ్జగణపయ్య

అందరి ఆరాధ్య దేవుడు బొజ్జగణపయ్య

చిత్తములో పర్యావరణ ఆకృతి!

గణనాధుని ప్రతిమలలో ప్రకృతి!!

ఇదే మన సనాతన సంస్కృతి!!!

 

గణనాథా…..

గణనాథుడు జానపదుల దేవుడు, తలపెట్టిన పనులన్నిటినీ ముందుండి విజయవంతంగా నడిపిస్తాడని గణపయ్య మీద తిరుగులేని నమ్మకం.చవితి పూజలు అందుకోవడానికి వినాయకుడు భూమ్మీదకు రావడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఆయన జనసామాన్యుల దేవుడు.

జగజ్జనని చేతుల్లో చిట్టిపొట్టి ‘బొమ్మగా గణపతి నలుగుపిండితో రూపుదిద్దుకున్నాడు. తల్లి అప్పగించిన బాధ్యతని నిర్భయంగా నిక్కచ్చిగా నిర్వహించాడు. పీకల మీదకు తెచ్చుకున్నాడు. మహాదేవుడు తను ఎరగకపోయి చేసిన పొరపాటుకి పశ్చాత్తాపపడ్డాడు. గజాసురుడి తలతో ఆ బాలుడికి తిరిగి జీవంపోశాడు. ఆ విధంగా ఆదిదంపతులిద్దరి చేతుల మీదుగా ఆవిర్భవించిన అద్భుతం మహాగణపతి. అనాది పుట్టుపూర్వోత్తరాలున్న దేవుడు ఈయన అనంతరం సమస్త విఘ్నాలకు రాజును చేశాడు తండ్రి మహాశివుడు. పెళ్లయినా, పేరంటమైనా, సంబరమైనా, సమరమైనా మొదట ఆ దేవరని పూజించి మొక్కులు తీర్చాల్సిందే. దేవుడి వ్రతమైనా* *ఏ దేవత నోమైనా మొదట పసుపు, వినాయకుణ్ణి అర్చించ వలసిందే.

పార్వతీ తనయుడు జానపదులకు హితుడయ్యాడు. సన్నిహితుడయ్యాడు. – గణపయ్య నిరాడంబరత గొప్ప గొప్ప చదువులెరగని శ్రమజీవులకు స్ఫూర్తిగానిలిచింది. అందము లేదు. ఐశ్వర్యము లేదు. ఆజానబాహుడు అసలే కాదు. అయినా మాకు ఈ దేవుడే కావాలని ఎంచుకున్నది జనసామాన్యం సామాన్యులు దండిగా సమర్పించగల పత్రితో మురిసి ప్రసన్నుడయ్యే గణపయ్య జానపదుల నిష్కల్మష హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. విఘ్నాలకు రాజు అంటే పరోక్షంగా విజయాలన్నీ ఆయన కనుసైగల్లో ఉన్నట్లే! మహా సామ్రాజ్యాన్ని గెలిపించాలంటే ఆయన చేతులోనే ఉంది. వజ్రాల గనికి అతి దగ్గరి దారి చూపాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది. ఎక్కడా అడ్డుపడకుండా సమస్త విద్యలు పూర్తి చేసుకోవాలంటే గణపయ్య దయ ఉంటే చాలు. అంతేకాదు. మానవాళి ఆరోగ్యానికి నిత్యం అవసరమయ్యే మూలధాతువుల్ని అందించే వన సంపద విఘ్నరాజుకి ప్రీతిపాత్రమైన పూజాద్రవ్యమైంది. ఆయనను స్మరిస్తూ పచ్చని గరికను సమర్పిస్తే చాలు ఆ దేవుడు పొంగిపోతాడు. కోరినవే కాదు, కోరని వరాలు సైతం కురిపిస్తాడు. అందుకే ఆయన ప్రజల దేవుడిగా నాటి నించి నేటిదాకా పూజలందుకుంటున్నాడు. ప్రజలు ఆర్భాటాలకంటే సాదాసీదాతనాల్ని ఎక్కువ గౌరవిస్తారు. విఘ్నరాజుని సదా సేవించే అనిందియుడు అనే ఎలుక దేవుడంత ప్రాచుర్యం పొందింది. ‘మూషిక వాహన గజాననా! మా ఊరి దేవుడా మహాననా’ అంటూ గ్రామీణులు భజనలు చేస్తారు. విఘ్నపతి పిల్లల దేవుడు. వినాయకుడి పండగ వచ్చిందంటే పిల్లలు నిద్రపోరు. పత్రి పూలు సేకరణలో తలమునకలవుతారు. సాటివారితో పోటీలు పడతారు. అనేకానేక పాటలు పద్యాలు తమ ముద్దుమాటలతో పాడి దేవుణ్ణి ఆనందపెడతారు. మహాతల్లి నలుగులోంచి ఆవిర్భవించిన మహాగణపతి యుగాలు మారినా నేటికీ గుప్పెడు బంకమట్టితోనే సిద్ధమై, చవితి పూజకు వేంచేస్తాడు. కుడుములు, ఉండ్రాళ్లు పెడితే కడుపార ఇష్టంగా తింటాడు. సామాన్య రైతు సైతం తన నేలలో పండిన దినుసులతో ఆ నైవేద్యాలు శ్రమ లేకుండా సమర్పించ గలడు. పూజ తర్వాత నిర్మాల్యం అతి తేలికగా నేలలో కలిసి సత్తువగా మారుతుంది. దేవుడు తిరిగి మట్టిలో ఒదిగిపోతాడు. పర్యావరణానికి మేలు తప్ప రవ్వంత కీడు జరగదు. ఏటా ఒకసారి పూజ జరిపించుకుని తన పత్రి ద్వారా ఆరోగ్య సూత్రాలను అందరికీ గుర్తు చేస్తాడు. సమస్త విద్యలకూ ఆరంభ శ్లోకం వినాయకుడు. అన్ని కళలకూ నాంది విఘ్నేశ్వరుడు. జన సామాన్యం భయభక్తులతోనే చనువు తీసుకుని ఈ దేవుడికి దగ్గరవుతారు. ఓ బొజ్జగణపయ్య అంటూ సంబోధిస్తారు. వినాయక చవితికి ప్రతి ఇల్లూ వినాయక మందిరం అవుతుంది. పిన్నలు, పెద్దలు ‘శివ శివ మూర్తివి గణనాథా! నువు శివుని కుమారునివి గణనాథా!’ అంటూ చిందులేస్తూ భజన పాటలు పాడతారు. తొమ్మిది రాత్రిళ్ల ఉత్సవం అత్యంత వైభవంగా మన నేలన సాగుతుంది. వినాయకుడి మట్టి బొమ్మని పాలవెల్లి నీడన పెడతారు. ఆకులతో, పూలతో, పళ్లతో పాలవెల్లిని అలంకరిస్తారు. ఒకనాడు పల్లెల్లో జోడెడ్ల బండిని కాడి దింపి బండి చట్రాన్ని పాలవెల్లిని చేసి అలంకరించి ఆ నీడన వినాయకుణ్ణి ప్రతిష్టించి పూజించేవారు. ఆరుగాలం కష్టించి పనిచేసే రైతుల దేవుడు గణపయ్య సకాలంలో వర్షం కావాలన్నా ఆయన దయే. అకాలంలో వానలు వద్దనుకున్నా ఆయన దయే మన మనసులో మాటకు సదా దన్నుగా వుంటాడని నమ్మిక, విశ్వాసం.

 

┈┉┅━❀꧁గణనాథా꧂❀━┅┉┈

 

పసుపు వినాయకుడు…

మన దేవతలందరిలోనూ గణపతిని మాత్రమే మహాగణపతి అని పిలుస్తాం. మహాగణపతి అంటే గొప్ప గణపతి, విశేషమైన గణపతి అని అర్థం. ప్రతి సంవత్సరం మనం పూజించే గణపతికి సైతం పూజనీయుడైన గణపతియే మహాగణపతి. ఆయనను మనం పసుపు ముద్దగా రూపొందించి పూజిస్తాం.

గణం అంటే ఒక సమూహం. గణనాయకులందరికీ నాయకుడే గణపతి!వినాయక చతుర్థినాడు మనం వరసిద్ది వినాయకునికి పూజలు జరుపుతాం. అయితే అలాంటి గణపతికి కూడా ప్రభువైన వాడు మహాగణపతి. ఆయనకంటే అధికులు ఎవ్వరూ లేరు. ఆ మహాగణపతినే మనం పసుపు విఘ్నేశ్వరునిగా పూజిస్తాం. శివుడు మహాగణపతిని పూజించాడు. ఆయన అనుగ్రహంతోనే త్రిపుర దహనం చేశాడు. ఆనాడు గణపతిని అర్చించకపోతే శివుని ప్రయత్నాలు సైతం వ్యర్థమై పోయేవి. శ్రీహరి వామనావతారం దాల్చినప్పుడు గణపతిని పూజించాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మసైతం ఆయనను ధ్యానించాడు… దాంతో ఆటంకాలు తొలగి సృష్టి నిలబడింది.

మహిషాసుర సంహారానికి ముందు జగదంబ సైతం గణపతిని ధ్యానించింది. మునిజనం మొదట తపస్సు ద్వారా అష్టసిద్ధులు పొందుతారు. వాటి ఆకరణలో పడవారెవ్వరూ మోక్షాన్ని పొందలేరు. వాటి ప్రదర్శనలో దిగజారిపోతారు. అప్పుడు మహాగణపతిని ధ్యానిస్తే ఆటంకాలు తొలిగి ముక్తిని పొందగలుగుతారు. ఆటంకాలను పరిహరించేది గణపతియే.

 

అసలు దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మ, ఆయన్నే మనం వేరువేరుగా రూపాలు కల్పించుకుని వరసిద్ధి గణపతిగా, విద్యాగణపతిగా, పతిగా, లక్ష్మీగణపతిగా ఇలా వేరువేరుగా పూజలు చేస్తున్నాం.

 

త్రిమూర్తులంటున్నాం. త్రిశక్తులంటున్నాం వీరంతా ఆయా కార్య సిద్ధుల కోసం కల్పించబడవారే. మాఘంలో సూర్యునిగా, దసరాల్లో అమ్మవారిగా, కార్తికంలో శివకేశవులుగా, భాద్రపదంలో గణపతిగా ఆయనొక్కడే వేర్వేరు ఉపాసనలు పొందుతున్నాడు. ఇవన్నీ సగుణ రూపాలు. అంటే కన్నూ ముక్కు వంటి అవయవాలు ధరించిన మూర్తులు. అయినా ఉన్నది ఒక్కటే. దాన్నే మనం ఈ మాయా జగత్తులో అనేకంగా చూస్తున్నాం. నిజానికి అనేకం లేనే లేవు. అద్దాల గదిలో నిలబడితే మనం అనేక రూపాలతో కనబడతాం. కానీ మనం ఒక్కరమే అవన్నీ మన ప్రతిబింబాలేనని మనకు తెలుసు. వాటికి బొట్టు పెట్టాలంటే అన్నింటికీ పెట్టనవసరం మూర్తు లందరికీ పెట్టినట్టు అవుతుంది. కదా! వినాయకుణి పూజించడం కూడా అలాంటిదే.

 

ఏనుగు తల, పెద్దపొట్ట, ఎలుక వాహనం, పాలవెల్లి ఇవన్నీ మనం కల్పించుకుంటున్నాం. అలాంటి కల్పనలో కూడా మనం చిత్తశుద్ధితో పూజిస్తే ఇవన్నీ ఆ మూల స్వరూపానికి చెందుతాయి. అలా అని ఈ గణపతుల పూజే ప్రధానం అని భావించకూడదు. మనం నిరుణ గణపతినే అంటే పరబ్రహ్మనే తొలిసారిగా అర్చించాలి. తల్లికి భోజనం పెట్టకుండా ఊరంతా సంతర్పణ చేసినా ఎలా ఫలితం లేదో అలానే నిరుణారాధన లేకుండా సగుణారాధన చేసినా ఆశించిన ప్రయోజనం సిద్ధించదు. అయితే ఎలా.? అందుకే ముందు పసుపు గణపతిని అర్చించడం ఆచారంగా చేశారు పెద్దలు. పసుపును ఒక గుండ్రని ముద్దగా చేసి ఏ పూజకైనా మనం మొట్టమొదటగా అర్చిస్తున్నాం. ఆ ముద్దకు అవయవాలుండవు. ఏనుగుతల ఉండదు. ఎలుక ఉండదు. అంతేకాదు నైవేద్యం కూడా. సరైన రూపం లేని బెల్లం ముక్కనే పెడతాం. ఇంట్లో ఏ శుభ కార్యక్రమం చేసుకున్నా ఈ పసుపు గణపతి పూజ చేయాల్సిందే. శుభకార్యాలకు మీదుకట్టడం కూడా మహాగణపతిని ఉద్దేశించి చేసేదే.

 

ఆఖరుకి వినాయక చవితి నాడు ఎంత ఖర్చుపెట్టి పెద్ద గణపతుల్ని ప్రతిష్ఠించినా ఈ హరిద్రాగణపతే అందరికీ మూలకారకుడు. ఆ నిర్గుణతత్త్వాన్నే వేదం కీర్తించింది. అన్ని గణాలకు ఆయనే ప్రధానం. కవులకే కవీశ్వరుడు స్వామి. ఆ స్వామికి మరొక పోల్చదగిన దైవం లేదు. అందరు దేవతలకు జ్యేష్ఠుడు. మహాగణపతియే ప్రధాన దైవం. ఆయన వల్లే వేదాలు వచ్చాయి. కనుక ఆయనే వేదగణాలకూ ప్రభువు. ఈ తత్త్వం తెలుసుకోగలగడమే ఒక అదృష్టం.

 

┈┉━❀꧁జై జై గణేశా꧂❀━┉┈

 

21 పత్రాలతో పూజ…..

 

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం I

ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాన్తయే॥

ఏ పూజ ప్రారంభించినా మొదట విఘ్నేశ్వరుడిని ఆరాధించడం ఆనవాయితి. ప్రతి దేవతా పూజకు ముందుగా గణపతిని పూజిస్తాం. ఈ రోజు వినాయక చవితి. వినాయకుడిని ఎన్ని రకాల పుష్పాలతో పూజించినా ఆయన పూజలో 21 పత్రాలు వుండాలి. ఈ రోజు ప్రత్యేకంగా అన్ని 21 పత్రాలతో పూజించడంలో ఎన్నో ఆరోగ్య సూత్రాలున్నాయి.

పత్రి పూజ-ఆరోగ్య రహస్యాలు:

శ్రావణం, భాద్రపదంలో వర్షాలు కురవడం వల్ల ప్రకృతి వచ్చగా కళకళలాడుతుంటుంది. ఈ సమయంలో లభించే పత్రాలను తుంచి, గణపతిని పూజించే సమయంలో తొమ్మిది రోజులు వాటిని తాకటం వల్ల, వాటి వాసన వల్ల ఆరోగ్యం చేకూరు తుందని అంటారు. కనుకనే ఇలాంటి విశేష సమయాల్లోనైనా చక్కగా అరటి, మోదుగ మొదలయిన ఆకుల్లో భోజనం చేయడం పరిపాటిగా మారింది. వినాయకుడికి సమర్పించవలసిన 21* *పత్రాల గురించి తెలుసుకుందాం.

మాచీ పత్రం:

ఇది అన్ని ప్రాంతాల్లో లభిస్తుంది. కుష్టు, బొల్లి వ్యాధులను తగ్గించి, దాహాన్ని తీరుస్తుంది. ఆకులను కొద్దిసేపు కళ్లపై పెట్టుకుంటే కంటి దోషాలు తగ్గుతాయి.

బృహతీపత్రం:

దీనిని వాకుడాకు అంటారు. ఇందులో తెలుపు, నీలి రంగు వూలు పూసే ఆకులుంటాయి. కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. దీని రసాన్ని చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారు. ఆకలిని పెంచుతుంది.

బిల్వ పత్రం:

దీనికి మరో పేరు మారేడు. వరమేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైంది. దీని వనరు శరీరానికి రాసుకుని స్నానం చేస్తే దురద, గజ్జి వంటి రోగాలు తగ్గుతాయి.

దూర్వాయుగ్మం:

దూర్వాయుగ్మం అంటే గరికి, ఏది వున్నా లేకపోయినా గరిక లేకుండా వినాయకుడి పూజ పూర్తి కాదు. గరిక అంటే ఆయనకు అంత ప్రీతి. వినాయక చవితి రోజే కాకుండా ఎప్పుడైనా వినాయకునికి గరికతో పూజించవచ్చు. దత్తూర అనగా ఉమ్మెత్త మొక్క ఇది వర్షాకాలంలో మాత్రమే వస్తుంది. ఇందులో నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త అని రెండు రకాలున్నాయి. ఎలుక కాటు విషాన్ని హరిస్తుంది. దీని ఆకులు, గింజలు, వేళ్లు అన్నిట్లోనూ ఔషధగుణాలున్నాయి.

బదరీ పత్రం:

*రేగు అనగా రేగు చెట్టు. దీని ఆకులను పుండ్లకు కడితే త్వరగా తగ్గిపోతాయి. రేగు ఆకులను రోజుకు ఒకటి రెండు చొప్పున 20 రోజులు తింటే వీర్యవృద్ధి కలుగుతుంది. రేగుపళ్లు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. బదరీపత్రం వల్ల గాత్ర శుద్ధి జరుగుతుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. తులసి మొక్కలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసిని పూజిస్తే సర్వదేవతలను, అన్ని వేదాలను, అన్ని తీర్థాలను సేవించినట్లే. ఇందులో లక్ష్మి, కృష్ణ, రామ అని రకాలున్నాయి. లక్ష్మి, తులసి కలిసి వున్న మొక్కలను రోజూ పూజించడం మంచిది.

మామిడి ఆకు:

శుభకార్య సమయాల్లో మామిడి తోరణాలతో పని ప్రారంభిస్తాం. లేత మామిడి ఆకులను, లేతకాడలను నమిలితే నోటి పూతలు, చిగుళ్ల బాధలు తగ్గుతాయి. నోటి దుర్వాసన పోతుంది. మామిడికాయ రక్తదోషాన్ని హరిస్తుంది.

గన్నేరు ఆకు:

దీని ఆకులు కుష్టు, దురదను తగ్గిస్తాయి. గన్నేరు ఆకు పసరు తలలోని చుండ్రును నివాస్తుంది. దీని వేరు బెరడు మానని పుండ్లకు కట్టుగా కడతారు. ఇందులో తెల్లగన్నేరు, ఎర్ర గన్నేరు, బిళ్ల గన్నేరు రకాలున్నాయి. గన్నేరు పూలు సంవత్సరం పొడవునా పూస్తాయి.

గణపతి గంగమ్మకు ఇచ్చిన వరం!

ఒకానొక సందర్భంలో గంగా మాత వినాయకుడిని “ఏమయ్యా వినాయకా ఎప్పుడూ పార్వతి ఒడిలోనే కూర్చుంటావు నా ఒడిలో కూర్చోవా?అని అడుగుతుందట. అప్పుడు గణనాథుడు గంగమ్మకు ఓ వరం ఇచ్చాడట!, సరేనమ్మా ప్రతీ సంవత్సరం నా పుట్టినరోజు నాడు నీ నుండి తీసిన బంకమట్టి తో నా ప్రతిమలు చేసి నన్ను పూజించి తిరిగి నీ ఒడిలో(నదిలో) కలుపుతారు!ఆ విధంగా నేను నీలోనే లయమవుతాను!అని వరం ఇచ్చారట మహా గణపతి!. అందువల్లనే మనమంతా మట్టి తో చేసిన వినాయకులను పూజించి తిరిగి నదిలో కలిపితే మనం వినాయకుని వరం తీర్చిన వారం అవుతాం!…

 

┈┉┅━❀꧁ జై గణేశా ꧂❀━┅┉┈

Author

Was this helpful?

Thanks for your feedback!