
అనధికార నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి: నగర కమిషనర్
అనధికార నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి: నగర కమిషనర్
• ప్రతి సచివాలయ పరిధిలో ముగ్గురు సభ్యులతో బృందం
• ఎల్.ఆర్.ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
కర్నూలు న్యూస్ వెలుగు: నగరంలోని సచివాలయాల వారీగా అనధికార లేఅవుట్లు, నిర్మాణాలను గుర్తించి, వాటిపై తీసుకున్న చర్యలపై నివేదికలు సమర్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశించారు. శనివారం ఆయన నగరపాలక కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులతో, సచివాలయ స్థాయి బృందాలతో సమీక్ష నిర్వహించారు. ప్లానింగ్, అమెనిటీస్, వెల్ఫేర్ కార్యదర్శులు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.
ప్రతి సచివాలయ పరిధిలో ప్లానింగ్, అమెనిటీస్, వెల్ఫేర్ కార్యదర్శులు సంయుక్త బృందంగా ఏర్పడి, క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రతి బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్‌కు అనుగుణంగా ఉందా? లేక విరుద్ధంగా ఉందా అనేది చెక్‌లిస్ట్ ప్రకారం పరిశీలించాలని, విరుద్ధంగా ఉన్న నిర్మాణ వివరాలను పట్టణ ప్రణాళిక విభాగానికి పంపాలని ఆదేశించారు.
వాటిపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. అదనపు ఫ్లోర్లు, అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు, తీసుకున్న చర్యలు వంటి అంశాలతో భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కూడా నివేదిక ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు. అలాగే అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ఇందులో నిర్లక్ష్య వైఖరి తగదని హెచ్చరించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, సూపరింటెండెంట్ సుబ్బన్న, డీసీపీ వెంకట రమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష తదితరులు పాల్గొన్నారు.