
భోదనా నైపుణ్యాలతో నవ సమాజం నిర్మాణం: ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్
కర్నూలు (న్యూస్ వెలుగు): మెగా డీఎస్సీ -2025 ఎంపికైన ఉపాధ్యాయుల ఇండక్షన్ ట్రైనింగ్ శుక్రవారం నన్నూరు సమీపంలోని రాఘవేంద్ర బీఈడీ కాలేజీలో ప్రారంభమైంది. ఎంపికైన ఉపాధ్యాయులందరితో వెబెక్స్ ద్వారా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీనివాసులు ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు మాట్లాడారు. బోధన నైపుణ్యాలతో విద్యను అందించాలని, శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విలువలను బోధించి నవ సమాజాన్ని నిర్మించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని మన కర్తవ్యం అక్షరాస్యులుగా మార్చడమొక్కటే కాదని, చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు మన ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్నారు. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా తీర్చిదిద్దాల్సిన మనందరి మీద అవసరం ఉందన్నారు. వెబెక్స్ సమావేశం అనంతరం జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో మన జిల్లా పోస్టులు మంజూరయ్యాయని ఉన్నతాధికారుల ఆదేశాలతో దాదాపు అన్ని పోస్టులు నియామకాలు చేయగలిగామని ఇక తక్షణ కర్తవ్యం విద్యారంగంలో మన జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని కోరారు. ప్రణాళిక బద్ధంగా రిసోర్స్ పర్సన్స్ జాగ్రత్తగా నోట్ చేసుకొని ఆచరణాత్మక కృషి చేయాలని అన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో జిల్లా వ్యాప్తంగా మండల విద్యాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.