
పన్ను వసూళ్లు వేగవంతం చేయాలి: కమిషనర్
కర్నూలు (న్యూస్ వెలుగు): నగరపాలక సంస్థకు రావాల్సిన ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీల వసూళ్లను వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక ఎస్‌బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, అడ్మిన్ మరియు అమినిటీస్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను రూ.96.28 కోట్లు, తాగునీటి కొళాయి చార్జీలు రూ.15.05 కోట్ల డిమాండ్ ఉందని తెలిపారు. ప్రతి విభాగాధికారి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పన్ను వసూళ్లపై పూర్తి దృష్టి సారించాలని ఆదేశించారు. మొండి బకాయిదారులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇందులో ఎటువంటి జాప్యం తగదని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్.ఈ. శేషసాయి, ఎం.ఈ. మనోహర్ రెడ్డి, ఆర్.ఓలు జునైద్, స్వర్ణలత, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.