
ప్రధాని బహిరంగ సభకు విజయవంతం చేయండి: మెప్మా పీడి
కర్నూలు (న్యూస్ వెలుగు): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీన నంద్యాల రోడ్డులోని రాగమయూరి గ్రౌండ్స్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి తీసుకోవలసిన ఏర్పాట్లపై, మెప్మా ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని ఆర్పీలతో (RPs) సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. బహిరంగ సభకు మెప్మా గ్రూప్ మహిళలను విస్తృతంగా సమీకరించాలని ఆర్పీలను ఆదేశించారు. ప్రతి సమాఖ్య నుండి కనీసం 150 మంది సభ్యులను సమీకరించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి సమాఖ్యకు 3 బస్సులు కేటాయించగా, ప్రతి బస్సులో ఒక ఆర్పి, ఒక జీఎస్డబ్ల్యూ (GSW) సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల కోసం అవసరమైన ఆహారం, తాగునీరు తదితర అన్ని సౌకర్యాలు సమకూర్చినట్లు తెలిపారు.
అలాగే ప్రతి ఆర్పి తమ పరిధిలోని గ్రూపులలో రోజుకు 10 గ్రూపుల చొప్పున సమావేశాలు ఏర్పాటు చేసి, కార్యక్రమ వివరాలు తెలియజేసి, సభకు అందరూ హాజరయ్యేలా కృషి చేయాలని సూచించారు. సభలో పాల్గొనేందుకు మహిళలకు అవసరమైన ఏర్పాట్లు సమయానుసారం పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎక్స్పర్ట్ మురళి, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి, టీఎంసీలు సుధాకర్, భారతి, సీఓలు మరియు ఆర్పీలు పాల్గొన్నారు.
