సీనియర్‌ అసిస్టెంట్లకు డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు

సీనియర్‌ అసిస్టెంట్లకు డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు

సుమారు 26 మందితో జాబితా

కర్నూలు,  న్యూస్ వెలుగు :

పాలనాపరంగా గ్రామ సచివాలయాలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువస్తోంది. దీనిలో భాగంగా సచివాలయాలపై పర్యవేక్షణ కోసం మండలానికి ఒక డిప్యూటీ ఎంపీడీవోను నియమించనున్నది. గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన సచివాలయాల వ్యవస్థలో జవాబుదారీతనం లేదనే వాదన ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం సచివాలయాలను సరిదిద్దే కార్యక్రమానికి నడుంబిగించింది. సచివాలయాల్లో మిగులు సిబ్బందిని ఇతర విభాగాలకు పంపింది. ఇంకా రేషనలైజేషన్‌ ద్వారా కొన్ని విభాగాలకు చెందిన కార్యదర్శులకు రెండేసి సచివాలయాల్లో బాధ్యతలు అప్పగించారు. అర్హత మేరకు డిజిటల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించారు. అయినా సచివాలయాలపై అనేక విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది కార్యదర్శులు, సర్వేయర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీఆర్వోలు, సర్వేయర్లు ఎక్కువ సమయం తహశీల్దారు కార్యాలయాల్లోనే ఉంటున్నారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత ఒక డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారికి అప్పగించాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించింది. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఆధీనంలో డిప్యూటీ ఎంపీడీవో విధులు నిర్వర్తించేలా పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ విధి విధానాలు రూపొందించింది.
కర్నూలు జిల్లాలోని మండలాల్లో 26 మంది డిప్యూటీ ఎంపీడీవోలను నియమించనున్నారు. ప్రస్తుతం అంతమంది డిప్యూటీ ఎంపీడీవోలు లేనందున పంచాయతీరాజ్‌ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించనున్నారు. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకున్న తరువాత అర్హులకు పదోన్నతులు ఇవ్వనున్నారు. గ్రామ సచివాలయాల పర్యవేక్షణ బాధ్యతను ఒక అధికారికి అప్పగించాలన్న పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆయా శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక నుంచి ఆయా శాఖల అధికారుల అజమాయిషీ ఉన్నప్పటికీ ప్రత్యేకించి డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారిని నియమిస్తే పాలన గాడిలో పడుతుందని ఉద్యోగులు అంటున్నారు. కేవలం ఒక అధికారిని నియమించి వదిలేయకుండా ఆయన పరిధిలో సిబ్బందిని నియమించి జాబ్‌చార్టు రూపొందిస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Author

Was this helpful?

Thanks for your feedback!