
సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి: కలెక్టర్
కర్నూలు (న్యూస్ వెలుగు): ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకూడదని, వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీ వచ్చిన వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రతి రోజు లాగిన్ ఓపెన్ చేసి, అర్జీకి సంబంధించిన అర్జీ దారుతో కింది స్థాయి సిబ్బంది కాకుండా జిల్లా అధికారులే ఓపిగ్గా మాట్లాడి, వివరాలు తెలుసుకొని పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. రీఓపెన్ కాకుండా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీ ని గడువు దాటే వరకు పరిష్కరించకుండా ఉండకూడదన్నారు. ఆడిట్ ప్రక్రియ వంద శాతం చేయాలని, సీఎం వో అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడి చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

