
డబ్బులకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు: మంత్రి టీజీ భరత్
కర్నూలు(న్యూస్ వెలుగు): తెలుగుదేశం పార్టీకి కానీ టీజీ కుటుంబానికి కానీ డబ్బులకు టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కార్పొరేటర్ ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్లు ఇస్తేనే టికెట్లు ఇస్తారన్న పుకార్లపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవ్వరూ నమ్మొద్దని ఆయన తెలిపారు. వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల్లో నమ్మకం పొందిన వారికే టికెట్లు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే నాలుగైదు సార్లు సమావేశాల్లో నాయకులు, కార్యకర్తలకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పినట్లు తెలిపారు. కార్పొరేటర్ టికెట్ ఇచ్చే ముందు సర్వేలు చేయించి అందులో మొదటి స్థానంలో ఉన్న వారికే టికెట్ కేటాయింపు జరుగుతుందన్నారు. కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు అర్హత డబ్బు ఎంత మాత్రం కాదని, ప్రజల మనసు గెలిచిన వారికే టికెట్లు ఇస్తామని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు పనికట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు మాటలు నమ్మొద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి టీజీ భరత్ చెప్పారు. నాయకులందరూ ప్రజల సమస్యలు, వార్డులో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

