
సకల సదుపాయాలతో టిడ్కో ఇళ్లు: కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు (న్యూస్ వెలుగు): నగర శివార్లలోని ఎన్టీఆర్ కాలనీ టిడ్కో గృహాలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దుతామని, ఈ నెల 17న 187 మంది లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఆయన టిడ్కో గృహాలను పరిశీలించారు. మరమ్మత్తులు, సదుపాయాలు, పనుల నాణ్యతలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. టిడ్కో కాలనీలో రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, రేషన్, పింఛన్, తాగునీరు వంటి సదుపాయాలను పూర్తిచేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు సౌకర్యవంతంగా నివసించేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. గృహాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించారని వివరించారు. ఇటివల మంత్రులు నారాయణ, టీజీ భరత్ సమీక్షలో తీసుకున్నా నిర్ణయంలో భాగంగా 976 మందికి టిడ్కో గృహాలను అప్పగించాల్సి ఉందని, తొలుత 17న 187 మంది లబ్ధిదారులకు అప్పగించి, తర్వాత ప్రతివారం అప్పగిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంఈ మనోహర్ రెడ్డి టిడ్కో ఈఈ సూర్య నారాయణ, డిఈలు గుప్తా, నరేష్, ఎంహెచ్ఓ నాగశివప్రసాద్, టిడ్కో అధికారి పెంచలయ్య, శానిటేషన్ ఇంస్పెక్టర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

