
ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలే..!
అమరావతి న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ లో ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే..!అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి. ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా చవక. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమే నని మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటా వరకూ… ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, రైతులకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇదే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరటి రైతులకు భరోసాగా వైస్సార్సీపీ నిరసనలు చేసింది.

విపత్తుల సమయంలో ఉచిత పంట బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు. పెట్టుబడి సహాయం కింద చేసిన హామీలు.. ఇవన్నీకూడా మోసమేనని ఆయన కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు. వైస్సార్సీపీ పాలనలో, టన్ను అరటికి సగటున రూ. 25,000 ధర లభించిందన్నారు. రైతు పండించిన పంట రేట్లు తగ్గిపోయిన పక్షంలో రైతులు నష్టపోకుండా ప్రత్యేక రైళ్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు నడిపించామన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించినట్లు తెలిపారు. దీనివల్ల లక్షలాది రైతుల కుటుంబాలను ఆదుకున్నామన్నారు.
కానీ నేడు కూటమి ప్రభుత్వం, వ్యవసాయం కూలిపోతుంటే… రైతులు నష్టాల్లో మునిగిపోతుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారన్నారు. కిలో ఆహారం 50 పైసలైతే…ఆ ఆహారాన్ని పండించే రైతుల శ్రమకు కట్టే విలువ ఎంత? ఆయన ప్రశ్నించారు.

