భారీ వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండండి
జిల్లా, డివిజన్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
నోడల్ అధికారులు 2 రోజులూ మండలాల్లో ఉండాలి
జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన కలెక్టర్టీఎస్ చేతన్
జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నెం. 08885 292432
పుట్టపర్తి, న్యూస్ వెలుగు ః
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి అన్ని రకాల ముందు జాగ్రత్తలనూ తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్
ఆదేశించారు. జిల్లా అధికారులు, మండల నోడల్ అధికారులు, ఆర్‌డిఓలు, మున్సిపల్ కమిషనర్లతో తహ ల్దార్లతో తన ఛాంబర్ నుంచి శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై సమీక్షించారు.
అల్పపీడనం శనివారం రాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటుతుందని, ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు. ఈ వర్షాల కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండల నోడల్ అధికారులు ఈ మూడు రోజులపాటు మండలాల్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. జిల్లా స్థాయితోపాటు, డివిజన్, మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయితీరాజ్, నీటి పారుదల, వైద్యారోగ్యశాఖ, విద్యుత్, వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, గృహనిర్మాణ శాఖలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాజ్‌వేలు, కల్వర్టులవద్ద ఈ మూడు రోజులూ కాపలా ఉంచాలని, నీరు పారే సమయంలో వాటిపై నుంచి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేసేముందు రెవెన్యూ అధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని డిపిఓకు సూచించారు. ఆసుపత్రుల్లో మందులు, అవసరమైన సామగ్రి సిద్దంగా ఉంచాలని, క్షేత్రస్థాయి సిబ్బంది ఈ మూడు రోజులూ గ్రామాల్లోనే ఉండాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. విద్యుత్ స్తంబాలు నేలకూలడం, వైర్లు తెగిపడటం కారణంగా ఎక్కడా ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు సూచించారు. పంట పొలాల్లో నీరు నిలిచిఉండకుండాచూడాలన్నారు.ఆర్డిఓలకు మరిన్ని సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ నెం.08885 292432 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.