
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి : ఎస్పీ
కర్నూలు న్యూస్ వెలుగు : శనివారం కర్నూలు కొత్తపేట దగ్గర ఉన్న ఆధునీకరించిన ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో ట్రాఫిక్ అవగాహన మరియు కౌన్సిలింగ్ సెంటర్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు.ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు మాట్లాడుతూ… కర్నూలు లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
ప్రమాదాలను తగ్గించేందుకు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ చేయాలన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆటో డ్రైవర్లు తమ భద్రతకు, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఆటో డ్రైవర్లందరూ తప్పనిసరిగా ఆటోల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు.
డ్రైవర్లు నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్‌లోడింగ్ చేయడం వంటివి చేయకూడదన్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆటోలను నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలన్నారు.
మైనర్లు వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయన్నారు. ఎవరైతే లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేత ట్రాఫిక్ రూల్స్ గురించి లఘు చిత్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.
కర్నూలు లో 5 వేలకు పైగా ఆటోలు ఉన్నాయన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ఆటో ఎక్కడానికి చేయి చాపడంతో ఆటో వాళ్ళు వెంటనే ముందు వెనక ఆలోచించకుండా ఆటోని అక్కడనే ఆపుతున్నారన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుజేస్తూ, వెనుకవచ్చే వారికి ప్రమాదాలకు గురిచేయకూడదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగనీయకుండా ఆటోలు నడపాలన్నారు.
ప్రతి ఆటోకు పోలీసు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా ఉండాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు , నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు.
ఎక్కడైనా అనుమానాస్పద కార్య కలాపాలు జరిగినా డయల్ 112 కు గాని, డయల్ 100 కు గాని పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్, ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ , కర్నూలు పట్టణ సిఐలు రామయ్యనాయుడు, నాగరాజా రావు, మురళీధర్ రెడ్డి, మధుసూధన్ గౌడ్, పవన్ కుమార్ , ట్రాఫిక్ ఆర్ ఎస్సై హుస్సేన్ , ఆటో యూనియన్ సంఘాలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.