కౌమారుల మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమం
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీ లక్ష్మి,డాక్టర్ రాగిణిల ఆధ్వర్యంలో హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మంజుల,ఐశ్వర్య,అంజలి, ఆశా కార్యకర్తలు బుధవారం మద్దికేర కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు కౌమారుల మానసిక ఆరోగ్యం పై బుధవారం రోజున అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మాట్లాడుతూ ప్రతి 20 మంది కౌమారులలో ఒకరు డిప్రెషన్ కు లోనవుతున్నారని,ఎక్కువగా 15 నుండి 24 సంవత్సరముల వయసులోని వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి కారణం లింగ వివక్షత,శారీరక, మానసిక మార్పులతోపాటు కౌమారులు తొందరగా కృంగిపోవడం,తీవ్రమైన ఒత్తిడికి గురికావడం జరుగుతుందని తెలిపారు.దీనికి అధిగమించడానికి యోగా,సమయానికి నిద్ర పోవడం,సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం,మంచి సామాజిక సంబంధాలను కొనసాగించడం,మంచి అలవాట్లు, ఆటపాటలు సృజనాత్మకతను పెంచుకోవడంతో పాటు వైద్యుల సలహాలు పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు,హెల్త్ సూపర్వైజర్లు కృష్ణమ్మ,సూర్యనారాయణ ఆరోగ్య మరియు ఆశా కార్యకర్తలు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.