
ప్రతి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు… పశువైద్యాధికారిని ప్రణీత
20 నుండి 31 వరకు అవగాహన సదస్సులు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో జనవరి 20 నుండి జనవరి 31 వరకు మండల పరిధిలోని గల గ్రామాలలో పశు ఆరోగ్య శిబిరాలు మరియు పశువుల ఆరోగ్యం పై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు పశువైద్యాధికారిని ప్రణీత తెలియజేశారు.ఈ సందర్భంగా మొదటి రోజులో భాగంగా రాతన గ్రామం నందు పశు ఆరోగ్య శిబిరాలను వారు ఏర్పాటు చేశారు.ఈ పశు ఆరోగ్య శిబిరాలలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న పశువులకు ఉచితంగా వైద్యాన్ని అందించి, పశు యజమానులకు ఉచితంగా మందులను అందజేశారు. అదేవిధంగా పశువుల ఆరోగ్యం పట్ల రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలను మరియు పలు సూచనలను పశువైద్యాధికారులు రైతులకు తెలియజేశారు. అదేవిధంగా ఈ అవగాహన సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం,గోకులం షెడ్లు, బహు వార్షిక పశుగ్రాసాల సాగు, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు మరియు పశు బీమా పథకం వంటి పథకాల గురించి అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. కావున గ్రామాలలో ఏర్పాటుచేసిన పశు ఆరోగ్య శిబిరాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారిని ప్రణీత తెలియజేశారు.అనంతరం ప్రజా అవగాహన కొరకై ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాతన మనోహర్ చౌదరి, గ్రామ ప్రజలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.