దర్గా ప్రాంగణంలో ఆకతాయిల వెకిలి చేష్టలు

దర్గా ప్రాంగణంలో ఆకతాయిల వెకిలి చేష్టలు

పవిత్ర ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఆకతాయిలు

ముజావర్ మహమ్మద్ రఫీ

జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు మండల పరిధిలోని హనుమద్గిరి (అనంతగిరి) గ్రామంలో ఉన్న హజరత్ రాజ్ బాగ్ సావార్ సాహెబ్ దర్గా భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లు తున్నదని ఇలాంటి పవిత్ర దర్గా ఆవరణంలో ఆకతాయిలు వెకిలి చేష్టలు చేస్తున్నారని ఇది చాలా తప్పు అని దర్గా ముజావర్ మహమ్మద్ రఫీ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో అనంతగిరి గ్రామంలోని రాజ్ బాగ్ సవార్ సాహెబ్ దర్గా ఆవరణంలో ఆకతాయిలు మద్యం సేవించి దర్గా ఆవరణంలో చెత్తాచెదారం వ్యర్ధాలు వేస్తున్నారని పవిత్ర ప్రాంగణంలో ఇలాంటి పనులు చేయడం చాలా బాధాకరం అన్నారు. అంతే కాకుండా దర్గాలో విద్యుత్ సౌకర్యార్థం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ లైన్లు కూడా కొందరు కావాలనే తొలగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన దర్గాలో దస్తగిరి స్వామి దర్గా, రాజ్ బాగ్ సవార్ సాహెబ్ పవిత్ర సమాధి మరియు నాగుల పుట్ట ఉన్నాయని తెలిపారు. స్థానికులే కాకుండా పొద్దుటూరు, మైదుకూరు, కడప, బద్వేలు, తాడిపత్రి, అనంతపురం వంటి ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఈ దర్గాకు భక్తులు వస్తుంటారని తెలిపారు. ఎంతోమంది భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు వస్తుంటారని తెలిపారు. భక్తితో కొలిచిన వారికి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న రాజ్ బాగ్ సవార్ సాహెబ్ దర్గా అవరణం లో ఆకతాయిలు కలుషితం చేయడం, చెత్తాచెదారాలు వేయడం మద్యం సేవించడం, విద్యుత్ వైర్లు తొలగించడం వంటి పనులు చేయకుండా పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు మందలించి భద్రతా చర్యలు చేపట్టాలని ముజావర్ మహమ్మద్ రఫీ కోరారు. అంతే కాకుండా దర్గా ఆవరణంలో కుక్కలు, పందులు వంటి జంతువులు తిరగకుండా దర్గాల చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేసేందుకు దాతలు సహకరించాలని ఆయన కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!