
చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి; నగేష్ డివైఎఫ్ఐ
న్యూస్ వెలుగు, కర్నూలు; ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు వాలంటీర్లకు అధికారంలోకి వస్తే 10000 ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిన్న శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్లు లేరు అని చెప్పడం సరైంది కాదని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగిస్తున్నట్లు జీవో విడుదల చేయలేదని అలాంటప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం బాధ్యతారహిత్యమని అన్నారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లు అందరికీ పదివేల రూపాయలు ఇస్తానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు సైలెంట్ గా ఉండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో కొంతమంది రాజీనామా చేస్తే, రాష్ట్రంలో లక్ష మంది రాజీనామా చేయకుండా ఉన్నారని తెలిపారు. వెంటనే అందరిని విధుల్లోకి తీసుకొని చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వాలంటీర్లతో కలిసి కూటమి ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.