దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
జిల్లా కలెక్టర్ పీ రంజిత్ బాషా
హొళగుంద, న్యూస్ వెలుగు: ఈ నెల 12 న దేవరగట్టు లో జరిగే బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ పీ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో దేవరగట్టు బన్ని ఉత్సవాల గురించి ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బన్ని ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. శాంతి, భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మూడు గ్రామాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో బన్ని ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు సూచిస్తున్నామన్నారు. రేపటినుండి గ్రామాలలో అవగాహన సభలను కూడా ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో బన్ని ఉత్సవాలు జరుపుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. బన్ని ఉత్సవాల సందర్భంగా అధికారులకు డ్యూటీస్ కూడా వేయడం జరిగిందన్నారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఈ బన్ని ఉత్సవాల్లో 24 గ్రామాల ప్రజలు పాల్గొంటారని, ఈ గ్రామాలలోని గ్రామ పెద్దలతో కూడా సమావేశం ఏర్పాటు చేశామని వారు కూడా శ్రీ మాల మల్లేశ్వర స్వామి పై ఉన్న గౌరవంతో మేము ఎలాంటి సంఘటనలకు పాల్పడమని తెలియజేశారన్నారు. బన్ని ఉత్సవాలలో గత సంవత్సరం మాదిరిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బందో బస్త్ పెంచడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా వారంతకు వారు తెలుసుకొని ప్రశాంత వాతావరణంలో సంబరాలు చేసుకుంటే బాగుంటుందన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సోమవారం నుండి కంటిన్యూగా పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎలా జరుపుకోవాలి అన్న విషయంపై గ్రామసభలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. బన్ని ఉత్సవాల సందర్భంగా డ్రోన్స్ ద్వారా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు లైటింగ్ను కూడా గత సంవత్సరాని కంటే ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలందరూ సహకరించి ప్రశాంత వాతావరణంలో బన్నీ ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ ప్రజలను కోరారు