ముడా స్కామ్‌లో కొనసాగుతున్న ఈడీ సోదాలు.. ఏపీ వైఎస్సారీపీ నేతకు షాక్ ఇచ్చిన దర్యాప్తు సంస్థ..!
మైసూర్ ; మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు శనివారం సైతం కొనసాగాయి. ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురిపై కేసు నమోదైంది. సాక్షాత్తూ సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతికి ముడా ద్వారా 14 ప్లాట్లు కేటాయించారని.. ఈ కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఈడీ శుక్రవారం ముడా కార్యాలయంపై దాడులు చేసింది. ఈ సందర్భంగా ఇతర వ్యక్తులను కార్యాలయ ఆవరణలోకి రాకుండా అధికారులు అడ్డుకున్నారు. మైసూర్‌లోని ముడా కార్యాలయం, తహసీల్ కార్యాలయం, నిందితుల స్థలాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ, సీఆర్‌పీఎఫ్ భద్రతా బృందం సోదాలు చేస్తోంది. భూసేకరణ, కేటాయింపు విధానాలపై ఆరా తీయాలని ఈడీ ముడాకు పలు లేఖలు పంపినప్పటికీ సంతృప్తికరమైన సమాధానం రాలేదని, ఆ తర్వాత దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
లోకాయుక్త ఇటీవల దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకుని, సీఎం, ఇతరులపై కేసు నమోదు చేయడానికి ఈడీ సెప్టెంబర్ 30 న ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదిక (ECIR) దాఖలు చేసింది. ఇదిలా ఉండగా.. ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీ, తెలుగు సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ తదితరుల ఇళ్లపై ఈడీ శనివారం దాడులు చేసింది. విశాఖపట్నం సహా ఐదు చోట్ల సోదాలు జరిగాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే ఆరోపణలతో సత్యనారాయణ తదితరులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మనీలాండరింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణ 2024 లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి వైఎస్సార్‌సీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, క్రిమినల్ బెదిరింపు ఆరోపణల నేపథ్యంలో స్థానిక పోలీసు కేసులో సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిల్ పొందిన విషయం విధితమే.