
అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు
తుగ్గలి (న్యూస్ వెలుగు) : కర్నూలు జిల్లా తుగ్గలి మండల వ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో కురిసిన భారీ వర్షాల వలన మండలంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ,దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 50 వేల పరిహారం ఇచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీరాములు రైతు సంఘం మండల కార్యదర్శి వి. కొండారెడ్డి లు డిమాండ్ చేశారు. బుధవారం నాడు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల బృందం మండలంలోని ముక్కెళ్ల, మారెళ్ళ,పెండేకల్లు గ్రామాలలో పంటల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా ఆగస్టు ,సెప్టెంబర్ మాసాలలో అల్పపీడనాలు ,తుఫాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వలన మండలంలోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు . అధిక వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని దిగుబడి వచ్చే సమయంలో చేతికి వచ్చిన పంట రైతుల కళ్ళముందే ఎండిపోతుందని, పంట రాలిపోతుందని పేర్కొన్నారు,ఇప్పటికే పండిన ఉల్లి, టమోటా పంటలకు సరైన ధర లేక రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ముల్గే నక్క పై తాటికాయ పడ్డ చందంగా అతివృష్టి వలన టమోటా ఆముదం కంది పత్తి సజ్జలు వంటి పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. మండలంలో విస్తారంగా రైతాంగం ఆశతో విస్తృతంగా సాగు చేశారని తీరా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాల వలన చేతికొచ్చిన పంట కళ్ళముందే రాలిపోతుంటే రైతుల ఆవేదన వర్ణనాతీతమని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎకరాకు 50 వేల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు మండలంలో వెంటనే రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు యంత్రాంగం కదిలి నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయంగా పరిహారం అందే టట్లుగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రైతు ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రంగరాజు, సుధాకర్, ప్రభాకర్ రెడ్డి, గంగాధర తదితరులు పాల్గొన్నారు.
