
భారత భూమే “యోగ భూమి!”
భారత భూమే “యోగ భూమి!” …
యావత్ ప్రపంచానికే ‘యోగా ను నేర్పిన ”విశ్వగురువు భారతదేశం”
సామాజిక సామరస్యానికి గొప్ప ఉపకరణం “యోగా”
“నవజీవనయోగం..“యోగ నాదం” !కు వేదికైన ఎ ఎన్ యు
ఎ ఎన్ యు కేంద్రంగా గుంటూరు జిల్లా ను“యాగాంధ్ర 2025 కు సమాయత్తం చేసిన జిల్లా యంత్రాంగం
“ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు జిల్లా కలెక్టర్ జి నాగలక్ష్మి ఐ ఎ ఎస్”
న్యూస్ వెలుగు నాగార్జున వర్సిటీ(జూన్18): మానవాళికి మానసిక, శారీరక సౌభాగ్యాన్ని ప్రసాదించే శక్తివంతమైన యోగ మార్గం “యోగా”. సామాజిక సామరస్యానికి గొప్ప ఉపకరణం “యోగా”.
ఈ కార్యక్రమములో ముఖ్యఅతిథిగా ఐఏఎస్ అధికారిణి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ భార్గవ తేజ,రాష్ట్రఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె మధుమూర్తి,కృష్ణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కె రామ్ జీ,ఎ ఎన్ యు తాత్కాలిక ఉపకులపతి కె గంగాధర రావు తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భముగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐ ఎ ఎస్ అధికారిణి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆమె మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర2025 వేడుకలను జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనదని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. యోగా పై అవగాహన కల్పించడానికి నిర్వహించు కార్యక్రమాలలో మాస్టర్ ట్రైనర్ లను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి, వారి ద్వారా సచివాలయ పరిధిలోని వారికి రిజిస్ట్రేషన్ చేసి వారి ద్వారా మూడు దశలలో శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇది ఒక్క రోజులో చేసి వెళ్లే కార్యక్రమం కాదని, ఒక అలవాటుగా చేసుకుని నిరంతరం అభ్యసించేలా చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు జిల్లా వ్యాప్తంగా ఐదువేల ప్రాంతాలలో 5000 మందితో కార్యక్రమం చేయబోతున్నామని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరిలో శారీరక, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత తోపాటు ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందించే సమగ్ర వ్యవస్థగా యోగా దోహదపడుతుందన్నారు. జీవితంలోని ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన సాధనముగా యోగ ఆసనాలు ప్రయోజనకరముగా ఉంటాయని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయడం ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కొత్త మధుమూర్తి మాట్లాడుతూ ప్రపంచ శాంతిని కాపాడటానికి యోగా ఒక సన్మార్గమని యోగా మన దినచర్యలో భాగంగా చేపట్టాలని సూచించారు. యోగాతో పరిపూర్ణమైన మానవులుగా తయారవుతారని ప్రపంచానికి ఒక సంకేతాన్ని పంపించాలని కోరారు. శారీరక దారుఢ్యం తో పాటు, మానసిక ఉత్తేజాన్ని అందించుటలో యోగా దోహదపడుతుందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే వ్యాయామం, యోగా, నడక వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
ఎ ఎన్ యు తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కె. గంగాధరరావు మాట్లాడుతూ ఆధునిక జీవితంలో ఒత్తిడి అంతర్లీనంగా దాగి ఉందని, యోగాతో ఒత్తిడినీ తగ్గించుకొని సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చని తెలిపారు.యోగా వేడుకలకు హాజరైన విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధకులకు, ఆయా కళాశాలల యాజమాన్యాలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
వర్సిటీ యోగ శిక్షకురాలు ఏ. రాధిక ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది యోగాసనాలు చేపట్టారు.
అనంతరం యోగా ప్రతిజ్ఞతో పాటు, దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చడానికి దృఢ నిర్ణయం తీసుకుందామంటూ ప్రతిజ్ఞ చేశారు.
“వర్శిటీ యోగా కేంద్రానికి చెందిన విద్యార్థిని చేసిన నృత్యం అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది.”
ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ తేజ,కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రామ్ జీ,ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జి. గణేష్ కుమార్, ఎ ఎన్ యు తాత్కాలిక రెక్టార్ ఆచార్య కే. రత్నషీలా మణి, తాత్కాలిక రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం,గుంటూరు ఆర్డీవో కృష్ణ కాంత్ లతోపాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకాడమిక్ అడ్వైజరీ ఆచార్య జి రోశయ్య, వర్సిటీ పాలకమండలి సభ్యులు ఆచార్య కెసుమంత్ కుమార్, ఆచార్య జగదీష్ నాయక్,ఆచార్య ఎమ్ త్రిమూర్తి రావు, దూర విద్యా కేంద్ర సంచాలకులు ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు,ఎ ఎన్ యు పరీక్షల సర్వ నియంత్రణాధికారి ఆలపాటి శివ ప్రసాద రావు, అనుబంధ కళాశాలల ప్రచార్యులు, అధ్యాపకులు,జిల్లా లోని వివిధ శాఖలకు చెందిన సిబ్బంది,జిల్లా యంత్రాంగం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ తెలుగు శాఖ విభాగాధిపతి, వర్శిటీ యూజీ కోర్సుల సమన్వయకర్త ఆచార్య నారి శెట్టి వెంకట కృష్ణారావు సభాధ్యక్షులుగా వ్యవహరించి తనదైన శైలిలో కార్యక్రమాన్ని యోగా యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ,యోగా పై ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమ ఉద్దేశ్యాన్ని అర్థవంతంగా చెప్తూ అందరినీ ఆలోచింపజేశారు.