
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోట్ల
డోన్ ప్రతినిధి ( న్యూస్ వెలుగు ) మార్చి 3 :మార్చి 9వ తేదీన నంద్యాల జిల్లా డోన్ మండలంలోని కొత్తబుర్జు గ్రామంలో జరగనున్న నూతన పట్టాదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్న నేపథ్యంలో, కార్యక్రమ ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ రోజు కొత్తబుర్జు గ్రామంలో సభ స్థలం మరియు హెలిప్యాడ్ ఏర్పాట్లను డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ పరిశీలనలో యువ నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి , నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబతుల కార్తీక్, ఆర్డీఓ శ్రీ నరసింహులు, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ & బి శాఖ అధికారులు పాల్గొన్నారు. వేదిక నిర్మాణం, హెలిప్యాడ్ స్థల ఎంపిక, రూట్ మ్యాప్, పార్కింగ్ సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన సూచనలు అందించారు.కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, పట్టాదారుల పాస్ పుస్తకాల పంపిణీ రైతులకు ఎంతో ప్రయోజనకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

