
ఆప్కాస్ రద్దు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి: సిఐటియు
న్యూస్ వెలుగు డోన్ : ఆప్కాస్ రద్దు ప్రతిపాదన ఉపసంహరించాలని,మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి టి.శివరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆప్కాస్ రద్దు ప్రతిపాదనను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం మస్టర్ పాయింట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్ గారికి వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వర్గం ది.6.2.2025 వ తేదీన జరిగిన సమావేశంలో ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు పొరుగు సేవల కార్మికుల నియామకాలను వివిధ ప్రభుత్వ శాఖలకు అధికారం ఇవ్వాలని తీర్మానించినట్లు వచ్చిన పిడుగులాంటి వార్త ఆప్కాస్ ఉద్యోగులలో మరియు ప్రజారోగ్యం,పర్యావరణ పరిరక్షణకు తమ ప్రాణాలొడ్డి పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులలో భయాందోళనలను రేకెత్తించిందని ఆప్కాస్‌లో నమోదైన వారు సుమారు లక్ష మంది ఉంటే అందులో దాదాపు 45 వేల మంది మన మున్సిపల్ కార్మికులే వున్నారని గత వైసిపి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే 6 నెలల్లో కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని,సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని హామీలను ఇచ్చిందని కాని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆప్కాస్ ను తెచ్చిందని అయితే ఆప్కాస్ వల్ల కార్మికులకు ప్రైవేటు ఏజెన్సీల బెడద లేకుండా పోయిందని ప్రతి నెల జీతాలలో కోత లేకుండా 1 లేదా 2 వ తేదీలలో జీతాలు కార్మికుల చేతికి వస్తున్నాయని పిఎఫ్, ఇఎస్‌ఐ వాటా నిధులు దుర్వినియోగం కావడంలేదని ప్రైవేటు ఏజెన్సీల రోజువారీ వేదింపులు,బెదిరింపులు లేకుండా పోయాయన్నారు. ప్రైవేటు ఏజెన్సీలకు అధికారాలు ఇస్తే కార్మికులకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని నిత్యం అభద్రతతో పనిచేయాల్సి వస్తుందని వేతనాలు సకాలంలో చెల్లించరని,పిఎఫ్,ఇఎస్‌ఐ నిధులు గోల్‌మాల్ అయ్యే ప్రమాదం కూడా ఉందని వారన్నారు.
దళారీలు ఇష్టారాజ్యంగా మారుతారని కార్మికులు నిత్యం వేదింపులు,అక్రమ తొలగింపులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.కావున ఆప్కాస్ రద్దు ప్రతిపాదనలు వెంటనే విరమించాలని,ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని వారు అన్నారు.అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని,గత 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల ఉద్యమాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులుమున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు పెద్ద ఎల్లయ్య,కుల్లాయప్ప , దేవదానం,గోవిందు,ఏసు, ఆవులయ్య,చాపల రామాంజి,సిద్ధప్ప,చంద్ర, సురేష్,మహిళా కార్మికులు పాల్గొన్నారు.