జాయింట్ అజమాయిషి ద్వారా రబీ పంట నమోదు
ప్రతి రైతు పంట బీమాను చేసుకోవాలి
పంట నమోదుతోనే ప్రభుత్వ పథకాలు వర్తింపు.
తుగ్గలి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్.
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: జాయింట్ అజమాయిషి ద్వారా రబీ 2024-25 పంట నమోదును నిర్వహిస్తున్నట్లు తుగ్గలి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలియజేశారు. సోమవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలో జాయింట్ అజమాయిషి రబీ పంట నమోదు కార్యక్రమాన్ని తుగ్గలి మండల తహాసిల్దార్ రమాదేవి ప్రారంభించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రమాదేవి మాట్లాడుతూ రెవెన్యూ,వ్యవసాయ శాఖ మరియు విలేజ్ సర్వేయర్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా పంట నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు తహాసిల్దార్ తెలియజేశారు.ఈ నెల చివరిలోపు పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం ఏవో పవన్ కుమార్ మాట్లాడుతూ రైతులందరూ పంట నమోదును తప్పక చేయించుకోవాలని, పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ఆయన తెలియజేశారు.అదేవిధంగా రబీలో సాగుచేసిన పంటలకు రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఇన్సూరెన్స్ ను చేయించుకోవాలని ఆయన రైతులకు తెలియజేశారు.పప్పు శనగ పంట ఎకరాకు 420,వరి పంటకు ఎకరాకు 630,జొన్న పంటకు ఎకరాకు 297, వేరుశనగ ఎకరాకు 480,ఉల్లి పంటకు ఎకరాకు 1350 రూపాయల చొప్పున చెల్లించి డిసెంబర్ 15 లోపు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆయన తెలియజేశారు.భీమా డబ్బులను రైతుల గ్రామాల పరిధిలోని గల రైతు సేవా కేంద్రాలలో చెల్లించుకోవచ్చని ఏ.ఓ తెలియజేశారు.కావున రైతులందరూ ఈ బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తుగ్గలి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ స్రవంతి,విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లోహిత్,వీఆర్ఏ లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.