జిల్లాలో వేసవిలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదు; మంత్రి టి.జి.భరత్
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్
కర్నూలు, న్యూస్ వెలుగు; రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో రబీ (2024-25) పంటలకు నీటి విడుదలకు సంబంధించిన నీటి పారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు బాగా పడ్డాయని, అందువల్ల తాగు నీటి సమస్యలు వచ్చే అవకాశం ఉండకూడదన్నారు..త్రాగునీటి సమస్యలను అత్యధిక ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, సిపిడబ్ల్యూఎస్ పథకం కింద ఫిల్టర్ బెడ్స్, ఓ అండ్ ఎమ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మంత్రి అధికారులను ఆరా తీశారు.. కొన్ని చోట్ల ఫిల్టర్ బెడ్స్, ఓ అండ్ ఎమ్ సమస్యలు గుర్తించడం జరిగిందని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని అధికారులు మంత్రి కి వివరించారు.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల వివరాలను తనకు అందించాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు..గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి చోరీ కేసులపై మంత్రి అధికారులను ఆరా తీశారు..2.6 కోట్ల రూపాయల విలువ చేసే ఆయిల్, కాపర్ చోరీ జరిగిందని, మోటార్లు రన్నింగ్ కండిషన్ లోకి తీసుకొని వచ్చేందుకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని ఇరిగేషన్ అధికారులు వివరించారు..
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామాన్ని సందర్శించి, తాగునీటి సమస్యలను గుర్తించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని డీపీఓ, జడ్పీ సీఈవో ను ఆదేశించారు.. సబ్ కలెక్టర్, ఆర్డీవోలు కూడా ఈ అంశంపై సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.. నీటి పథకాలకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే జడ్పీ, మండల పరిషత్ నిధుల నుండి మరమ్మత్తులు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.. పెద్ద సమస్యలు ఉంటే ఇప్పుడే నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వేసవి కాలం లో ఎక్కడా త్రాగునీటి సమస్య ఉండకూడదని కలెక్టర్ ఆదేశించారు.. ఈ మేరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు..
ఎస్ఎస్ ట్యాంక్ లు, చెరువులు నింపి తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.. ప్రతి ఇంటికి నీరందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారుల మీద ఉందని కలెక్టర్ పేర్కొన్నారు…
హంద్రీ నీవా నీటితో 68 చెరువులను నింపే అంశానికి సంబంధించి మార్చి లోపు అన్ని చెరువులను నింపాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు..
పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని, ఇక్కడ ఎక్కువగా సన్న, చిన్న కారు రైతులు ఉన్నారన్నారు.. పాణ్యం నియోజకవర్గంలో హంద్రీ నీవా పక్కనే ఉన్నప్పటికీ త్రాగు, సాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కేబినెట్ మీటింగ్ లో హంద్రీ నీవా వెడల్పుకు ఆమోదం తెలపడం జరిగిందని, తద్వారా 40 టిఎంసి లకు అదనంగా మరో 23 టిఎంసిలు పెరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఈ నీటి నుండి 10 టిఎంసిల నీటిని అదనంగా కేటాయించాలని తీర్మానం చేయాలని కోరారు. కర్నూలు జిల్లాకు సాగు, త్రాగు నీరు అవసరాలకు, ఓర్వకల్లులో నిర్మించే మెగా ఇండస్ట్రియల్ హబ్, జిల్లాలోని చెరువుల నింపుకోవడం కోసం ఈ నీరు ఎంతగానో అవసరం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదే విధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కూడా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ రాబోయే వేసవిలో ఆదోని పట్టణానికి త్రాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం జరిగిందని, ఆ మొత్తాలను పాత బిల్లులకు అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారని,అలా జరగకుండా చూడాలని,తాగునీటికి సమస్యలు లేకుండా నిధులు వినియోగించేలా చూడాలని అధికారులను కోరారు..ఆదోని కి సంబంధించి ఎల్ ఎల్ సి ద్వారా తాగు, సాగు నీటి సరఫరా గురించి అధికారులను వివరాలను కోరగా సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సమాధానమిస్తూ …ఖరీఫ్ లో రెండు వేల ఎకరాలకు నీటిని విడుదల చేశామని, రబీలో 3,600 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. ఎల్ఎల్సీ నుండి ఆదోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు..
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ… ఎల్ సి నుండి ఏప్రిల్ 15 వరకు పంటలకు నీరు అందించాలని, దేవనకొండ మండలంలో చెరువులకు మరమ్మత్తులు చేయించాలని కోరారు.. ఆలూరు చెరువునున్ఎస్ ఎస్ ట్యాంకు గా మార్చి నీరు నింపాలని, గజ్జే హళ్లి, బాపురం, చింతకుంట చెరువుల స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు… ఏబీసీ కెనాల్ కు తూము ఏర్పాటు చేయాలని, ఆస్పరి మండలంలో అన్ని గ్రామాలలో నీటి సమస్య ఉందని, పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు..
IAB సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు IAB సమావేశంలో ఆమోదించిన తీర్మానాల వివరాలను కలెక్టర్ వివరించారు.. 1)కేసీ కెనాల్ నీటి విడుదల కు సంబంధించి, ఎక్కువ విస్తీర్ణం నంద్యాల జిల్లా లో ఉన్నందున నంద్యాల నీటి పారుదల సలహా మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తీర్మానించినట్లు కలెక్టర్ తెలిపారు..
2) తుంగభద్ర దిగువ కాలువ క్రింద కర్నూలు జిల్లాలో రబీ పంటలకు గాను డిసెంబర్ 10వ తేదీ నుండి మార్చి ఆఖరు వరకు 45 వేల ఎకరాలకు నీటిని అందించాలని తీర్మానించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు..
3) హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదిత విస్తరణ పనులు జరిగే అవకాశం ఉన్నందున, అదనంగా లభించబోయే నీటిలో కర్నూలు జిల్లాకు 10 టి.ఎం.సి ల నీటిని కేటాయించాలని తీర్మానించడం జరిగిందన్నారు..
4) గాజులదిన్నె ప్రాజెక్టు కింద నవంబర్ 30 వ తేదీ నుండి 15 వేల ఎకరాలకు రబీ పంటలకు నీటిని విడుదల చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు.
5) వచ్చే మార్చి ఆఖరు నాటికి 68 చెరువులను నింపే కార్యక్రమం పూర్తి కావాలని తీర్మానించడం జరిగిందన్నారు..
5) కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగిందని కలెక్టర్ వివరించారు..సమా వేశంలో ఎమ్మెల్సీ మధుసూదన్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జలవనరుల శాఖ ఎస్ ఈ బాలచంద్రా రెడ్డి, హంద్రీ నీవా ఎస్ ఈ రామ గోపాల్, కే సీ కాలువ ఈ ఈ ప్రతాప్, తుంగభద్ర దిగువ కాలువ ఈ ఈ శైలేశ్వర్, ఆర్ డి ఎస్ ఈ ఈ భాస్కర్ రెడ్డి, చిన్న నీటి పారుదల ఈ ఈ శ్రీనివాసులు, 68 చెరువుల డి ఈ రామకృష్ణ, ఆర్డీవోలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.